ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారు

SMTV Desk 2019-04-04 16:43:19  TDp, elections,

ఎన్నికల నాట టీడీపీ అభ్యర్ధుల ఇళ్ళ మీద ఐటీ దాడులు, ఈడీ దాడులు అధికం అవుతున్నాయి. పాత కేసులని కూడా తోడి ఆ పార్టీ అభ్యర్ధులని భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2009లో వంశీపై ఆయుధాల చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. గతంలో తనకు ప్రభుత్వ రక్షణ వద్దంటూ ప్రైవేట్ భద్రతను వంశీ ఏర్పాటు చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని ఆయనపై అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు వంశీ హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. అయితే ఈ విషయం మీద వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఈ కేసును 2013లోనే హైకోర్టు కొట్టి వేసిందని, ఇప్పుడు తనను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి నాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని నాంపల్లి కోర్టుకు నివేదిస్తానని ఆయన చెప్పారు.