టీడీపీ తొలి జాబితే ఈ రోజే

SMTV Desk 2019-03-14 11:07:29  TDP, CM, AP CM,

అమరావతి,, మార్చ్ 14: అధికారిక తెలుగు దేశం పార్టీ తరపున లోక్‌సభ, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధిష్ఠానం గురువారం విడుదల చేయనుంది. 120కి పైగా శాసనసభ, 14 వరకు ఎంపీ స్థానాలకు అభ్యర్ధులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలను ఉండవల్లికి ఆహ్వానించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వేర్వేరు మార్గాల్లో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వీటన్నింటిని క్రోడీకరించి తుదిరూపు ఇస్తున్నారు. ఫలితాలు సానుకూలంగా ఉన్నవారికి సర్వే పత్రాలు ఇచ్చి నియోజకవర్గంలో జాగ్రత్తగా పనిచేసుకోమని సూచనలు ఇచ్చారు . తన దృష్టికి వచ్చిన లోపాలను తెలియజేసి సరిచేసుకోవాలని మరికొందరికి నిర్దేశిస్తున్నారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు వాటి పరిధిలోని అన్ని శాసనసభ స్థానాలపై సమీక్ష పూర్తి చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజానా చౌదరి ఆధ్వర్యంలో రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. సమస్యలు గుర్తించి, పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారు. చివరిగా వారితో చంద్రబాబు మాట్లాడి ఒక కొలిక్కి తెస్తున్నారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా ఈ సమావేశాలకు మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులను ఆహ్వానించరు. ఈ దఫా వారికి కూడా ఆహ్వానం పంపారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వీరందరితో చర్చించిన మీదట తొలి జాబితా ప్రకటించనున్నారు.