టీడీపీ ఎంపి కి మ‌ళ్లీ భారీ షాక్

SMTV Desk 2019-03-13 12:40:44  Sujana choudary, enforcement department

అమరావతి, మార్చ్ 13: టీడీపీ ఎంపి సుజ‌నా చౌద‌రికి మ‌ళ్లీ భారీ షాక్ త‌గిలింది. ఆ మ‌ధ్య వేల కోట్లు బ్యాంకుల్లో రుణం తీసుకుని ఎగ‌వేశాడ‌ని ఆయ‌న‌పై ఈడీ దాడులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఆ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌నిగింది అనుకుంటున్న త‌రుణంలో సుజ‌నా చౌద‌రి సంస్థ‌ల‌కు మ‌రో ఝ‌ల‌క్ త‌గిలింది. తెలంగాణ‌లోని న‌ల్ల‌గొండ జిల్లాలో వున్న మెట‌ల్ ప్రోడ‌క్ట్ కంపెనీకి వంద‌ల కోట్లు రుణం ఇచ్చిన బ్యాంకు అధికారులు మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌న‌ఖీలు చేసి కంపెనీని సీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్నిక‌ల వేళ ఉన్న‌ప‌లంగా సుజ‌నా కంపెనీల‌ను సీజ్ చేస్తుండ‌టంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంది.

న‌ల్ల‌గొండ జిల్లా కేతేప‌ల్లి మండ‌లం చీక‌టి గూడెంలోని సుజ‌నా చౌద‌రికి చెందిన ప‌రిశ్ర‌మ‌ను పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్‌, ఐడీబీఐ, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి సుజ‌నా చౌద‌రి భారీ స్థాయిలో రుణాలు తీసుకున్నారు. తిరిగి చెల్లంచ‌క‌పోవ‌డంతో చెన్నై డెట్స్ రిక‌వ‌రీ ట్రిబ్యున‌ల్ ను ఆశ్ర‌యించారు. దీంతో సుజ‌నా చౌద‌రి కంపెనీల‌ను సీజ్ చేయాల‌ని స‌ద‌రు కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం ఎన్నిక‌ల వేళ సుజ‌నా చౌద‌రికి పెద్ద షాకే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు సుజ‌నాకు చెందిన 11 డొల్ల కంపెనీల్లో షాద్‌న‌గ‌ర్‌కు చెందిన 2 కంపెనీలు,బొల్లారంలోని 2 కంపెనీలు, చెన్నైలోని 2 కంపెనీలు,చీక‌టి గూడెంలోని ఒక కంపెనీని అధికారులు సీజ్ చేయ‌డంతో సుజ‌నా సామ్రాజ్యానికి బీట‌లు మొద‌ల‌య్యాయి.