రానున్న ఎన్నికల్లో టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలి : నాగ బాబు

SMTV Desk 2019-03-12 09:30:08  Nagababu,

హైదరాబాద్, మార్చ్ 12: జన సైనికులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతోందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, సినీ నటుడు నాగబాబు తెలిపారు. తమ కార్యకర్తలను మానసికంగా ఎంత వేధిస్తే తాము అంత పైకి ఎదుగుతామని స్పష్టం చేశారు. గుంటూరులో సోమవారం ఆయన మెగా, పవన్‌ అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. కేసులు పెడితే బెదిరేది లేదనీ, జన సైనికులపై చేయిపడితే ఊరుకునేది లేదన్నారు. తాను పార్టీలో సభ్యత్వం తీసుకోనప్పటికీ పవన్‌ గెలుపు కోసం జనసైనికులతో కలిసి పనిచేస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని, జనసేనను గద్దెనెక్కించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో కులాల మధ్య అధికారం కూరుకుపోయింది. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే పవన్‌ లాంటి వ్యక్తులు అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాల్లో తమ్ముడు ఒంటరివాడైనా.. అభిమానులు మెండుగా ఉన్నారు’ అని నాగబాబు అన్నారు. టీడీపీ ప్రజలకు దూరమైందనీ, కుమారుడిని సీఎం చేయటమే ధ్యేయంగా ఆ పార్టీ అధినేత ముందుకెళ్తున్నారని చెప్పారు. అధికార యంత్రాంగం నిజాయతీగా వ్యవహరించాలని, పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలని హితవు పలికారు. ఇటీవల గుంటూరులో జనసేన కార్యకర్తలపై పోలీసు కేసులు పెట్టడాన్ని ఉదహరిస్తూ అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. సమావేశానికి మీడియాను అనుమతించలేదు.