మరోసారి దాడికి ఉగ్రవాదుల వ్యూహాలు

SMTV Desk 2019-03-08 12:04:35  Terrorist, Attack, India, Plans, Jammu, Kashmir

శ్రీనగర్, మార్చి 8: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి మరువక ముందే జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు మరో దాడికి సిద్ధం అయ్యారట. నిషేధిత జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ భారత్ పై మరో దాడి జరిపేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరించాయి. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో అలాంటి దాడులు జరిపేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.

నిఘా సంస్థలకు అందిన సమాచారం మేరకు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ వైమానిక దళం జరిపిన దాడులకు ప్రతీకగా కాశ్మీర్ పై మరో దాడి చేసేందుకు జైషే మొహమ్మద్ సంస్థ ప్లాన్ చేసుకుంది. నిర్దిష్టమైన సమాచారం అందడంతో రాష్ట్రంలో భద్రతా సంస్థలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. మసూద్ అజర్ నాయకత్వంలోని జైషే మొమ్మద్ ఉగ్రవాదులు ఖాజీగుండ్, అనంతనాగ్ లలో ఈ దాడులు చేయాలనీ ప్రణాళిక వేసుకున్నట్లు సమాచారం. ఈసారి తమ ప్లాన్ ను అమలు చేయడానికి టాటా సుమో ఎస్ యూవీ వాడాలని కూడా అనుకున్నట్లు సమాచారం అందింది.

నిన్న జరిగిన జమ్మూ లోని బస్సులో పేలుడు ఘటన తరువాత నిఘా సంస్థలకు ఆ ప్లాన్ కు సంబంధించిన సమాచారం అందింది. బస్సులో సంభవించిన పేలుడులో ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. పేలుడుకు పాల్పడిన వ్యక్తిని కూడా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యక్తిని విచారించగా, అతను కూడా జైషే మొహమ్మద్ కు చెందిన వ్యక్తిగా తేలింది. తన నేరాన్ని అంగీకరించాడు. ుల్గామ్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్ అలియాస్ ఒమర్ ఈ దాడికి ప్లాన్ వేసినట్లు అతను పేర్కొన్నాడు.