తెలంగాణలో ఏపీ పోలీసులుకు ఏం పని ?

SMTV Desk 2019-03-05 11:48:08  telangana, ap, ktr, chandra babu

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ స్కాంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రుల అనుమతి లేకుండా వారి సమాచారాన్ని ఐటీ కంపెనీకి ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ హస్తమేమీ లేదని, ఏపీ ఓటర్ల సమాచారాన్ని టీడీపీ చోరీచేసిందని వచ్చిన ఫిర్యాదు మేరకే తెలంగాణ పోలీసులు స్పందించారని ఆయన తెలిపారు. తెలంగాణలో ఏపీ పోలీసులుకు ఏం పనని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఐటీ చట్టం ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేశారని, ఏం తప్పుచేయని చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు భయపడుతున్నారన్నారు.

అడ్డంగా దొరికినపుడు చంద్రబాబు, లోకేష్‌లు మిద్దె నెక్కి అరుస్తూంటారన్నారు. ఐటీ గ్రిడ్స్‌ పైన విచారణ జరుపుతుంటే టీడీపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఐదు కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ఐటీగ్రిడ్స్‌కు ఇవ్వమని ఆయనకు ఎవరు అనుమతిచ్చారని, ప్రజల్లో పరపతి తగ్గిపోవడంతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని విమర్శించారు. అడ్డంగా దొరికిపోయి బుకాయించుకోవడం ఆయకు అలవాటేనని, డేటా చోరీ కేసులో చంద్రబాబు తప్పుకుచేయకపోతే ధైర్యంగా విచారణను ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటపడాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే 18 కేసలలో స్టేలు తెచ్చుకున్నారని ఈ కేసులోనూ స్టే తెచుకోమనండని తెలిపారు. నకిలీ ఫేస్‌బుక్ ఐడిలు సృష్టించి టీఆర్ఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ డ్రామాలతో ప్రయోజనం లేదని తెలిపారు.