''ఏపీకి వస్తున్నా చంద్రబాబు కాస్కో'' అంటూ హెచ్చరించిన అసదుద్దీన్ ఓవైసీ

SMTV Desk 2019-03-02 16:36:49  ap assembly elections, mim party, asaduddin owisi, tdp, chandrababu, trs kcr

హైదరాబాద్, మార్చ్ 2: హైదరాబాద్ లో జరిగిన ఎంఐఎం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అసదుద్దీన్ మాట్లాడుతూ ఏపీకి వస్తున్నా చంద్రబాబు నాయుడు కాస్కో అంటూ హెచ్చరించారు. తాను ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా పర్యటిస్తానని, వైసీపీ గెలుపుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ నుండి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తమ టార్గెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 పార్లమెంట్ సీట్లు గెలుపొందడమేనన్నారు. టీఆర్ఎస్ తో పొత్త పెట్టుకున్నప్పుడు అనేకమంది విమర్శించారని తెలిపారు. బీజేపీతో టీఆర్ఎస్ కలిసిపోతుందని వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ముస్లిం పార్టీగా తమకు తెలుసునని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఏపీలో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేస్తే నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలలోని ముస్లిం మైనార్టీ ఓటర్లను ప్రభావితం చెయ్యగలరని ప్రచారం జరుగుతోంది. ఇదిగనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బేనని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏపీలోని కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించి ఎంఐఎం పార్టీ జెండా ఎగురవేసింది.