తూర్పుగోదావరిలో తల్లీకుమార్తెలను నగ్నంగా చేసి దాడి

SMTV Desk 2019-02-27 17:18:30  east godavari, mother daughter, crime news

తూర్పుగోదావరి, ఫిబ్రవరి 27: పొలానికి సంబంధించిన విషయంలో వాగ్వాదం చెలరేగడంతో కొందరు దుండగులు రెచ్చిపోయారు. తమకు అడ్డు వస్తున్నందుకు తల్లీకుమార్తెలను వివస్త్రలను చేసి చెట్టుకు కట్టేసి కొట్టారు. అనంతరం వీధుల్లో ఈడ్చుకెళ్లారు. ఈ సందర్భంగా తమను కాపాడాలని తల్లీకుమార్తెలు ఆర్తనాదాలు చేయగా, సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ బాలిక(11)తన తల్లితో కలిసి ఉంటోంది. అయితే వీరి కుటుంబానికి భూ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుకుటుంబాల మధ్య నిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సదరు వ్యక్తులు రెచ్చిపోయారు. తల్లీకుమార్తెలను వివస్త్రలుగా చేసి ఓ చెట్టుకు కట్టేశారు. అనంతరం విచక్షణారహితంగా చావబాదారు. ఆ తర్వాత వీధుల వెంట నగ్నంగా ఈడ్చుకెళ్లారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు బాధిత కుటుంబం ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.