సొంత కులానికి ప్రాధాన్యం ఇస్తున్న బాబు: ఆధారాలు చూపిస్తున్న వైసీపీ

SMTV Desk 2019-02-07 17:01:33  Jaganmohan Reddy, Chandra Babu, tdp, ycp, 2019 elections, police, buggana rajendranath reddy, kula rajakeeyam

అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారవర్గాన్ని తమ సొంత కులం వారితో నింపేశారని వైసీపీ ధ్వజమెత్తింది. పోలీస్ శాఖలో కమ్మ కులస్తులకే పెద్దపీట వేసారని.. సొంత కులం వారికే కీలకమైన పోస్టులు అప్పగించి ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ విషయంపై ఈసీకి కంప్లయింట్ ఇచ్చారు. కాగా ఏపీ ప్రభుత్వం 37 మంది సీఐలకు ఏసీపీగా ప్రమోషన్లు ఇచ్చారని.. అందులో 35 మంది కమ్మ కులస్తులేనని ఆయన కంప్లయింట్ లో పేర్కొన్నారు. అయితే మరో వ్యక్తి కమ్మ మహిళను వివాహం చేసుకున్నందుకు అతనికి కూడా ప్రమోషన్ ఇచ్చారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దీని గురించి మరిన్ని వివరాలు బయటపెట్టారు. విజయవాడ, గుంటూరు,రాజమండ్రి, తిరుపతి తదితర చోట్ల కమ్మ కులస్తులకే పోస్టింగులు ఇచ్చారని అంటున్నారు. పోలీసు సంఘం వారు దీనిపై నిజాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. అయితే తమ పార్టీ ఇచ్చిన జాబితా ఒక శాంపుల్ మాత్రమేనని ఇంకా బయటపెట్టాల్సినవి చాలా ఉన్నాయని బుగ్గన అన్నారు. రాష్ట్రంలో కీలకమైన పోస్టులన్నీ కమ్మ కులస్తులకే ఇచ్చారని.. అందుకు రాష్ట్ర నిఘా విభాగంలో ముఖ్యమైన పోస్టుల్లో ఉన్న ఎబి వెంకటేశ్వరరావు, యోగానంద్, మాదవరావు, గీత ఉదాహరణలని ఆరోపించారు. మిగిలిన సామాజికవర్గంలో ఎవరూ నిఘా శాఖకు పనికిరార? అని బుగ్గన ప్రశ్నించారు.