నేడు రాజీనామా.. రేపు వైకాపా కండువా...!

SMTV Desk 2017-08-02 12:25:23  MLC SHILPA CHAKRAPAANI RESIGNED TO TDP

హైదరాబాద్, ఆగష్టు 2 : తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి అందరు ఊహించిన విధంగానే ఈ ఉదయం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తనకు శ్రీశైలం అసెంబ్లీ టిక్కెట్ గ్యారంటీగా ఇస్తామంటేనే పార్టీలో ఉంటానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాని అటువంటి హామీలను ఎన్నికల ముందు వద్దని వారు హితవు పలికి వెళ్లిపోయారు. పార్టీలో తనకు ఎంతమాత్రమూ ప్రాతినిథ్యం దక్కలేదని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన తన కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకొని రాజీనామా చేయడానికే మొగ్గు చూపారు. ఇదిలా ఉండగా ఈ మధ్యాహ్నం తరువాత జగన్ ను కలిసి చర్చించనున్న చక్రపాణి, రేపు నంద్యాలలో జరిగే భారీ బహిరంగ సభలో వైకాపాలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన తన ముఖ్య అనుచరులతో కలిసి జగన్ ను కలిసేందుకు బయలుదేరారు. కాని టీడీపీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి చక్రపాణి రెడ్డి రాజీనామా చేయనున్నారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.