కొడుకులు వైసీపీలో తీరుగుతుంటే నీకేమో మా పింఛను కావాలా

SMTV Desk 2019-02-04 17:56:14  Denduluru MLA Chinthamaneni Prabhakar, YSRCP, TDP, Pension distribution

అమరావతి, ఫిబ్రవరి 4: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్ర‌తిసారీ ఏదో ఒక స‌మ‌స్య‌తో వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. దీంతో చింత‌మ‌నేనిని ఎప్పుడూ వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇటీవల ఆయన తన సొంత సామాజికవర్గానికి చెందినా వ్యక్తిపై చేయి చేసుకున్నారు. తాజాగా మరోసారి చింతమనేని తన నోటి దురుసును ప్రదర్శించారు. ఆయన ఒక వృద్ధుడిపై తన దూకుడును ప్రదర్శించారు.

దెందులూరు నియోజకవర్గం విజరాయి గ్రామంలో ఆదివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనికి ముఖ్య అతిధిగా చింతమనేని హాజరయ్యారు. ఆయనే స్వయంగా పించన్లు అందజేసారు. కాగా.. ఆ గ్రామానికి చెందిన సుబ్బారావు (75) అనే వృద్దుడు అందరిలాగానే పించను తీసుకోడానికి వచ్చాడు. అతన్ని చూడగానే చింతమనేని నీ కొడుకులు వైసీపీలో తీరుగుతుంటే మేమిచ్చే పింఛన్ ఎందుకు తీసుకుంటున్నావంటూ దుర్భాషలాడారు. పింఛన్‌ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా అని అవమానించాడు.

అయితే తండ్రిని తీసుకువెళ్ళడానికి కార్యక్రమం జరిగే స్థలానికి వచ్చిన కుమారుడు రాధకృష్ణ జరిగిన విషయం తెలిసి ఎమ్మెల్యేను నిలదిసాడు. దీంతో అతని పైన చింతమనేని దౌర్జన్యం చేసాడు. ఆ తోపులాటలో సుబ్బారావు కాలికి గాయమైంది. అనంతరం పోలీసులు రాధాకృష్ణను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు. రాధాకృష్ణన్ను అన్యాయంగా అరెస్ట్ చేసారంటూ వైసిపి నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.