చంద్రబాబుతో భేటీ అయిన కోట్ల..

SMTV Desk 2019-01-29 15:26:12  chandrababu, kotla suryaprakash reddy, tdp, kurnool, congress, andhra pradesh, elections 2019

అమరావతి, జనవరి 29: టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబ సమేతంగా సమావేశం అయ్యారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు విందుకు ఆహ్వానించగా ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై కోట్ల దంపతులు చంద్రబాబు నాయుడుతో చర్చించారు. కర్నూలు పార్లమెంట్ స్థానం కావాలని కోరగా దానిపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆశిస్తున్న డోన్ అసెంబ్లీ స్థానంపై కూడా చర్చించారు. కానీ ఆ స్థానం ఇచ్చే అంశంపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం. డోన్ కి బదులు ఆలూరు అసెంబ్లీ స్థానం లేదా ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. భేటీ అనంతరం కార్యకర్తలతో సమావేశం అయి మంచి రోజున పార్టీలో చేరతామంటూ చంద్రబాబుకు కోట్ల కుటుంబం చెప్పినట్లు సమాచారం.