అమరావతిలో గృహ ప్రవేశానికి రెడీ అయిన జగన్..

SMTV Desk 2019-01-29 12:26:53  YS Jagan mohan reddy, YCP, Amaravathi new house, house opening, ycp office

అమరావతి, జనవరి 29: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజధాని అమరావతి నుంచే పార్టీని నడిపించాలని నిర్ణయించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్, తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశ ముహూర్తాన్ని నిర్ణయించారు. వచ్చే నెల 14వ తేదీన ఉదయం 8.21 గంటలకు ఆయన గృహ ప్రవేశం చేయనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన తన ఇంటిని నిర్మించుకున్నారు. పాదయాత్ర తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సమరభేరీ మోగించేందుకు సిద్ధమైన జగన్, ఇక రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయాలనుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లోనే నివాసం ఉంటే ప్రయాణాలకు అధిక సమయం కేటాయించాల్సి వస్తుందని ఇక అమరావతి నుంచే రాజకీయాలు నడపాలని నిర్ణయించుకున్నారు.

ఇక జగన్ ఇంటికి అతి సమీపంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. దీని నిర్మాణం కూడా పూర్తయింది. కాగా త్వరలోనే వైసీపీ పూర్తి యంత్రాంగం అమరావతికి మారుతుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గృహ ప్రవేశం ఇంటి సభ్యులు, కొందరు ముఖ్య అతిథుల మధ్య జరుగుతుందని, ఇక అదే రోజున జరిగే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వైసీపీ శ్రేణులంతా హాజరవుతారని సమాచారం.