పోలీసులే నన్ను హంతకుణ్ణి చేశారు...!

SMTV Desk 2019-01-18 14:04:10  Ayesha meera murder case, Accused Sathyambabu, CBI Interrogation

కృష్ణా, జనవరి 18: ఉమ్మడి రాష్ట్రంలో పన్నెండు సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ బృందం సత్యంబాబును విచారించడానికి కృష్ణా జిల్లాలోని అనాసాగరంలో ఉన్న సత్యంబాబు వద్దకు శుక్రవారం ఉదయం చేరుకుంది. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను అతను అధికారులకు అందజేశాడు. అయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బతకడానికి తనకు ఉపాధి కూడా లేదని వాపోయాడు. సత్యం బాబు ఇంటిలో ఉన్న వస్తువులను తనిఖీ చేయడంతో పాటు బ్యాంక్ ఖాతాలలో గత ఎనిమిదేళ్లలో జరిగిన వ్యవహారాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. అంతకు ముందు సత్యంబాబు ఎం చేసేవాడు, ఎంతవరకు చదువుకున్నాడు అన్న దానిపై సీబీఐ బృందం ఆరా తీశారు.
ఆయేషా మీరా హత్యకు ముందు సత్యంబాబు ఎన్ని దొంగతనాల కేసుల్లో అరెస్ట్ అయ్యాడు అన్న దానిపై రికార్డులు పరిశీలించారు. నిర్దోషిగా ప్రకటించిన తర్వాత మళ్లీ ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ సీబీఐని సత్యంబాబు ఎదురు ప్రశ్నించాడు.





గతంలో తాను సెల్‌ఫోన్లు దొంగతనం చేసేవాడినని అంతకుమించి తాను ఎలాంటి నేరం చేయలేదని సత్యంబాబు వివరించాడు. తొలిసారి తనను అరెస్ట్ చేసిన పోలీసులు కంచికచర్ల సమీపంలోని ఓ రిసార్ట్‌కు తరలించినట్లు తెలిపాడు. రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు వొప్పుకోవాలని బెదిరించారని అతను వ్యాఖ్యానించాడు. ప్రాణభయంతోనే తాను ఆయేషా మీరాను హత్య చేసినట్లు వొప్పుకున్నట్లు సత్యం బాబు వెల్లడించాడు. అయితే ఆయేషాను ఏ విధంగా చంపింది వివరిస్తూ గతంలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు ప్లే చేసి.. కొన్ని ప్రశ్నలు సంధించారు. పోలీసుల స్క్రిప్ట్‌ ప్రకారమే చెప్పా.. నా వాయిస్ మిమిక్రీ చేయించి ఎడిటింగ్ ద్వారా తానే హంతకుడినని పోలీసులు మీడియాకు విడుదల చేశాడని సత్యంబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. జైల్లో ఎవరెవరు కలిసేవారు, కోర్టులో నీ తరుపున వాదించిన న్యాయవాదులకు ఫీజు ఎవరు కట్టారు అని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సత్యంబాబుతో విచారణ పూర్తయిన అనంతరం ఇబ్రహీంపట్నంలో ఆయేషా మీరా హత్యకు గురైన దుర్గా హాస్టల్‌ను సీబీఐ అధికారులు పరిశీలించనున్నారు.