కోళ్ళ పందాల చరిత్ర....

SMTV Desk 2019-01-14 13:07:54  Cock fighting, Andhrapradesh, Sankranthi festival, History of cock fighting

అమరావతి, జనవరి 14: సంక్రాంతి అనగానే ముందు గుర్తొచ్చేది కోళ్ళ పందాలు. ఇవి లేకుండా అస్సలు పండుగ ఎక్కడా జరుగదు దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాంప్రదాయంగా భావిస్తూ గత కొన్ని దశాబ్దాలుగా జరుపుకుంటున్నారు. అయితే కోళ్ళ పందాలకు మాత్రం పందెం రాయుళ్ళు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కోడి పందాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు పూర్తి స్థాయిలో కోడి పందాలను నిర్వహించనున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత పది రోజులు ముందుగానే కోడి పందాలు వేసేందుకు సన్నాహాలు చేశారు. ఇందుకుగాను తెరవెనుక కొందరు బడా నేతలు వీటిని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందాలను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం తదితర జిల్లాల్లో లక్షలాది రూపాయల మేర చేతులు మారేందుకు అవసరమైన డబ్బును సిద్ధం చేసుకున్నారు.





తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేలా ప్రతీ ఏటా కోడి పందాలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి కూడా జోరుగా కోడి పందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు. సంప్రదాయం పేరుతో కోళ్లకు కత్తులు కట్టకుండా పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నా, కత్తులను కట్టే వారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. పందాలను అడ్డుకోవడం ఎవరి తరం కాదని నిర్వహకులు తేల్చిచెబుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రాజకీయ నేతల ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ముందు నుండి కోళ్లకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ కోడి పందాలకు పందెం రాయుళ్లు సిద్ధం చేశారు. జీడిపప్పు, బాదం, పిస్తాలతో పెంచిన కోళ్లను పందాల రాయుళ్లు బరిలోకి దించేందుకు సన్నద్దమవుతున్నారు. ప్రముఖులు కొందరు పందాల నిమిత్తం కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. వొక్కో పుంజు ఖరీదు 2 వేల రూపాయల నుండి 5 వేల రూపాయల వరకూ ధర పలుకుతోంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అయితే 10 వేల రూపాయల వరకూ ధర పలుకుతుందని చెబుతున్నారు.

కోడి పందాలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజధాని అమరావతి తదితర ప్రాంతాల్లో కోడి పందాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. చెరకు, అరటి, మామిడి తోటలతోపాటు, శివారు ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. మరికొందరైతే ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ టెంట్లు వేసి మరీ కోడి పందాలు నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. పందెపు కోళ్లను లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి పందాలకు తెగబడుతున్నారు. రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కోడి పందాలకు పేరెన్నికగన్న ప్రాంతాలుగా మంచి గుర్తింపు పొందాయి. ఇతర రాష్ట్రాల నుండి సైతం ఈ పందాలకు తరలిరావడం ఏటా సర్వసాధారణమైంది. భీమవరంలో పండుగ మూడు రోజుల్లోనూ కోట్లాది రూపాయల మేర చేతులు మారుతుంటాయి. ఇక్కడి పందాలను చూసేందుకు వచ్చినవారి కోసం భీమవరం పట్టణంలోని అన్ని లాడ్జీల్లో గదులన్నీ ఇప్పటికే బుక్‌ అయిపోయాయి. పట్టణంలో పేరుమోసిన హెటల్స్‌, లాడ్జీలు దాదాపు 20 ఉండగా, జనవరి నెల 11వ తేదీ నుండి పండుగ ముందు రోజుల్లోనే గదులను బుక్‌ చేసుకున్నారు.

భీమవరం పట్టణానికి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అతిధిలు వచ్చే అవకాశం ఉండడంతో పట్టణంలోని పేరెన్నికగన్న రెస్టారెంట్లలో సరికొత్త వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా సమద్ర చేపలతో ఎక్కువ రకాలను అందుబాటులో ఉంచినట్లు తెలిసింది. జిల్లాలోని తీరంతోపాటు, కాకినాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి సముద్రపు చేపల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి నిల్వ ఉంచేందుకు అవసర మైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కోడి పందాలకు ప్రసిద్దిగాంచిన భీమవరం, నరస్సాపురం పరిసర గ్రామాల్లో ఏర్పాట్లు మూడు రోజుల క్రితమే పూర్తి చేశారు. తణుకు మండలం తేతలి, వేల్పూరు గ్రామాలు, ఇరగవరం, అత్తిలి, జంగారెడ్డిగూడెం, పోలవరం, పెనుమంట్ర, పెనుగొండ, ఆచంట తదితర మండలాల్లో ఇప్పటికే నిర్వహకులు బరులు సిద్ధం చేశారు. నర్సాపురరం పట్టణ శివారు రుస్తుంబాద, వేములదీవి, లక్ష్మణేశ్వరం, సీతారామపురం, మొగల్తూరు, కేపీపాలెం, పేరుపాలెం, గాళిపట్నం, ఐ భీమవరం, వెంప ప్రాంతాలు ఖరీదైన పందేలాకు పెట్టింది పేరు. ఇక్కడి పోటీలు తిలకించేందుకు సినిమా స్టార్లు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి రాజకీయ ప్రముఖులు వస్తుంటారు.

మెట్ట ప్రాంతంలోని ముఖ్యంగా చింతలపూడి మండలం పోతునూరు, సీతానగరం, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం, పంగిడిగూడెం, కామవరపుకోట మండలం కళ్లచెర్వు, రావిపాడు, సాగిపాడు, కామవరపుకోట, లింగపాలెం మండలంలో ములగలంపాడు, కొణజర్ల, కలరాయనగూడెం గ్రామాల్లో ఏటా భారీగా పందాలు నిర్వహిస్తారు. ప్రధానంగా ములగలంపాడు, కళ్లచెర్వు గ్రామాల్లో ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటు చేసి మరీ రాత్రి, పగలు పందాలు నిర్వహిస్తుంటారు. ఈ పందాలతోపాటు, కోసాట, పేకాడ, గుండాట వంటి జూదాలను కూడా యదేచ్ఛగా నిర్వహిస్తారు. కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల్లో పందేలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని గన్నవరం, పెనమలూరు, ఉయ్యూరు, దివిసీమ, నాగాయలంక, నూజివీడు, గుంటూరు తదితర జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందాలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పలువురు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పందెంరాయుళ్లు కారులు, జీపుల్లో చేరుకుని బెట్టింగ్‌లు నిర్వహించడం ప్రతీ ఏటా జరుగుతూనే ఉంది.

పెద్దపల్లిలో అయితే ప్రముఖ రాజకీయ నాయకులు దశాబ్దాలుగా గ్రామంలో కోడి పందాలను ప్రోత్సహిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాల్లోని చాలా గ్రామాల్లో నాటుకోళ్లు పెంచేవారంతా పందెం కోళ్లను పెంచుతున్నారు. ఇక్కడ పందెం కోడి ధర 2 వేల రూపాయల వరకూ పలుకుతోంది. ఇక్కడి పందెం కోళ్లను నాగపూర్‌, చంద్రాపూర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాల నుంచి వచ్చిన వారు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఈ పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ రాజకీయ నేతలు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులతోపాటు, ఉన్నత స్థాయి అధికారులు, దగ్గరుండి పందెపు కోడికి కత్తులు కట్టించి బరిలో దింపేలా సన్నద్దం అవుతున్నారు. ఈ ఏడాది కొందరు ప్రజాపత్రినిధులు దగ్గర ఉండి బహిరంగంగానే కోడి పందాలను నిర్వహించేలా చర్యలు చేపట్టారు. కొందరు ప్రజాప్రతినిధులైతే తమ పేరు మాత్రం బయటకు రాకుండా గోప్యత పాటిస్తూ కోడి పందాలకు భారీ ఎత్తున డబ్బులు ఖర్చు చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా తోటల్లో నిర్వహించే కోడి పందాలకు సకల ఏర్పాట్లు చేసినా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.