కోడికత్తి కేసులో కీలక మలుపు...!!!

SMTV Desk 2019-01-12 17:46:26  Jagan attempt to murder case, Srinivasrao, NIA, Lawyer Saleem, Interrogation, High court, Special court, Petition

విజయవాడ, జనవరి 12: వైఎస్ జగన్ కోడికత్తి దాడి ప్రధాన నిందితుడు శ్రీనివాసరావును లాయర్(సలీం) సమక్షంలో విచారించే వెసులుబాటు కల్పిస్తూ ఎన్ఐఏ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని అయితే విచారణ పేరుతో శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు రహస్య ప్రదేశంలోకి తీసుకు వెళ్లారని కనీసం ఎక్కడకు తీసుకెళ్లారో కూడా చెప్పడం లేదని న్యాయవాది సలీం కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ కోర్టు శ్రీనివాసరావును కస్టడీలో తీసుకునే సమయంలో ఎన్ఐఏ అధికారులకు పలు సూచనలు చేసింది. నిందితుడుని కస్టడీలో తీసుకున్నసమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదని, మూడు రోజులకు వొకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిందని తెలిపారు. అలాగే న్యాయవాది సమక్షంలోనే శ్రీనివాసరావును విచారించాలని కోర్టు ఆదేశించిందన్న విషయాన్ని లాయర్ సలీం తన పిటీషన్లో ప్రస్తావించారు. తక్షణమే నిందితుడి ఎక్కడ ఉన్నా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే సిట్ అధికారులను తాను కలిసినట్లు తెలిపారు.

అయితే సిట్ అధికారులు సైతం శ్రీనివాసరావును విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉంచుతారా, విజయవాడ ఉంచుతారా, లేక హైదరాబాద్ తీసుకెళ్తారా అన్నది వారికి కూడా తెలియడం లేదన్నారు. ఎన్ఐఏ కోర్టు ఆదేశాలతో శనివారం నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న వెంటనే శ్రీనివాసరావును ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. అయితే శ్రీనివాసరావును విశాఖపట్నంలోని విమానాశ్రయంకు తీసుకు వెళ్లారా లేక విజయవాడలోనే విచారిస్తున్నారా అన్న అంశాలపై చర్చనీయాంశంగా మారింది.