జగన్ పై దాడి : రచయితగా మారిన నిందితుడు

SMTV Desk 2019-01-04 20:02:39  YSRCP, YS Jagan, Srinivasrao, Attacked with knife

అమరావతి, జనవరి 4: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నాడు. అయితే ఈయన జైల్లో వొక పుస్తకం రాస్తునాడంట. తాను కోరుకుంటున్న మార్పుపై జైల్లో శ్రీనివాసరావు పుస్తకం రాస్తున్నాడు. తన భావాలను, తాను ఏం ఆశిస్తున్నాడో అన్ని విషయాలను ఆ పుస్తకంలో పొందుపరిచినట్లు ఆయన తరపు న్యాయవాది సలీం చెప్పుకొచ్చారు. తాను పుస్తకం రాసిన విషయాన్ని నిందితుడు శ్రీనివాసరావు తనకు చెప్పాడని దాన్ని పబ్లిష్ చెయ్యాలని తనను కోరినట్లు తెలిపారు. దాంతో ఆ పుస్తకం విడుదలకు తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాసరావు అభ్యర్థన మేరకు జైలర్ ను సంప్రదించినట్లు తెలిపారు.

అలాగే పుస్తకం విడుదలకు సంబంధించి న్యాయమూర్తికి, జైళ్లశాఖ డీజీకి లేఖలు రాసినట్లు తెలిపారు. శ్రీనివాస్ రాసిన పుస్తకాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, ఇటీవల జరిగిన పరిణామాలకు విరుద్ధంగా ఉంటే దాన్ని అనుమతించే ప్రసక్తేలేదని జైల్ సూపరింటెండెంట్ చెప్పినట్లు లాయర్ సలీం చెప్పారు. నిందితుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్ కు వీరాభిమాని అంటూ లాయర్ సలీం చెప్పుకొచ్చారు. తనకు గ్రీటింగ్ కావాలని తన కుటుంబ సభ్యులకు, తమ నాయకుడు వైఎస్ జగన్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలి అంటూ డిసెంబర్ 24న తనను కోరినట్లు చెప్పారు.