జగన్ ని కాపాడేందుకే హై కోర్ట్ విభజన ?? ... చంద్రబాబు

SMTV Desk 2018-12-29 11:35:09  AP, CM, Chandrababu, YSRCP, YS Jaganmohan reddy, HIgh court, Central government

అమరావతి, డిసెంబర్ 29: వైఎస్‌ఆర్‌సిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కేసులపై హై కోర్టులో విచారణ దాదాపు వొక కొలిక్కి వస్తున్న క్రమంలో ఈ విచారణను వాయిదా వేయడం ద్వారా ఆయనకు మేలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైకోర్టుని హడావుడిగా విభజించడం న్యాయాధికారులు, ఉద్యోగులు మానసికంగా సిద్ధమయ్యేందుకూ గడువివ్వకుండా ఏపి కి తరలించమనడం దానిలో భాగమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని చెప్పారు. హైకోర్టు విభజన నేపథ్యంలో జగన్‌పై కేసులు విచారిస్తున్న సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని, కేసుల విచారణ మళ్లీ మొదటికి వస్తుందని వెల్లడించారు.

‘‘ఇంతవరకు జగన్‌ కేసులు విచారించిన జడ్జి బదిలీ అవుతారు. జగన్‌ పై కేసుల్ని కూడా విభజిస్తారు. తెలంగాణకి సంబంధించిన కేసుల్ని అక్కడ ఏపీ కేసుల్ని ఇక్కడ విచారిస్తారు. కేసులకు సంబంధించి అభ్యంతరాలు చెప్పడం పూర్తయి, ఇక వాదనలు మొదలవుతున్న దశలో ఇలా చేశారు. దీని వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతుంది… అని వివరించారు. ‘‘కేంద్రం ఏది ఎలా చేస్తోందో? ఇంకా వాళ్ల కుట్రలు కుతంత్రాలు ఏంటో? దేని కోసం చేస్తున్నారో? అంతా ఆ దేవుడికే తెలియాలి… అని ఆయన వ్యాఖ్యానించారు.