అధికారులను అప్రమత్తం చేసిన చంద్రబాబు..!

SMTV Desk 2018-12-17 13:22:19  Chandrababu Teleconference, Pethai Cyclone

అమరావతి, డిసెంబర్ 17: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెథాయ్‌ తుపానును అత్యవసర పరిస్థితిగా భావించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావిత జిల్లాలన్నింటికీ రెడ్‌అలర్ట్‌ ప్రకటించి దానికి అనుగుణనంగా పనిచేయాలని ఆదేశించారు. పెథాయ్‌ తుపాన్‌పై సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. విపత్తుల సమయంలో ఎవరూ సెలవులు పెట్టవద్దు అని.. అందరూ విధులకు హాజరై తమ బాధ్యతలను నిర్వర్తించాలని సీఎం స్పష్టం చేశారు. విపత్తును ఎదుర్కోవడంపై ప్రతిశాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.

రాష్ట్రంలో విపత్తులు కొత్త కాదని, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుపాన్ల కాలమేనని గుర్తుచేశారు. తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ వర్షాలు పడుతున్నాయన్న చంద్రబాబు ప్రతి జిల్లాలో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ప్రణాళికలను సిద్ధం చేసుకోని ముందు జాగ్రత్త చర్యలతో జన నష్టం, పశునష్టం నివారించాలని ఆదేశించారు. ప్రజల ఇబ్బందులను తగ్గించి, ప్రజల్లో ప్రభుత్వం అండగా ఉందనే భరోసా ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు అల్పాహారం, భోజనం, తాగునీరు అందించాలని.. పాలు, కూరగాయలతో సహా నిత్యావసరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈరోజు సాయంత్రానికే ఆయన విశాఖకు చేరుకుంటానని.. మంత్రులు, ఎమ్మెల్యే లు అందరూ మధ్యాహ్నానికే మండలాలకు చేరాలని ఆదేశించారు. సహాయ చర్యలలో నేతలు,కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.