పెథాయ్ బీభత్సం..!

SMTV Desk 2018-12-17 12:18:48  Pethai Cyclone, Andhra Pradesh, Pethai Cyclone Effect

హైదరాబాద్, డిసెంబర్ 17: నాలుగు రోజుల నుంచి బంగాళాఖాతంలో బలపడుతూ, అధికారులను, ప్రజలను ఆందోళనకు గురిచేసిన పెథాయ్ తుఫాను యానాం - తుని ప్రాంతాలకు దగ్గరైంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మ‌ధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరానికి 80 కిలోమీటర్ల దూరంలోకి తుఫాను కేంద్రం వచ్చేసింది. గంటకు 19 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతూ ఉండటంతో మరో నాలుగు నుంచి ఐదు గంటల్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంట‌కు 80 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తుఫాను కారణంగా పలుచోట్ల చెట్లు కూలిపోయి రాకపోకలు స్తంభించిపోయాయి, విశాఖలో భారీ వర్షాలు పడుతూ ఉండటంతో ఈరోజు టేకాఫ్ కావాల్సిన 14 విమానాలను రద్దు చేశారు. దీని వల్ల దాదాపుగా 200 మంది ప్యాసింజర్లు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు పడుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా వర్ష భావం ఎక్కువ ఉండటంతో తీర ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను రద్దు చేసారు.