రెండేళ్లలో శాశ్వత హైకోర్టు నిర్మాణం : బాబు

SMTV Desk 2018-11-19 16:33:29  Andrapradesh, Governament, Central governamnet, High court

అమరావతి, నవంబర్ 19: ఆదివారం విజయవాడలోని గేట్ వే హోటల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌, న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికే ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు, దర్యాప్తు చేపట్టడానికి వీల్లేదంటూ నిర్ణయం తీసుకున్నామని, ఇటీవల కాలంలో సీబీఐ పనితీరు ఎంత ఘోరంగా దిగజారిపోయిందో చూస్తున్నామన్నారు. అధికారాలను వారికి ఇవ్వాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలోని ఏసీబీ బాగా పనిచేస్తోందని చెప్పారు. సీబీఐలోని ఉన్నతాధికారులే విభేదాలతో వ్యవస్థకు చెడ్డపేరు తీసుకొచ్చారని, ఈ విషయం సుప్రీంకోర్టు విచారణలో ఉందని.. అవన్నీ తేలాలన్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న సీబీఐకి మద్దతు ఉపసంహరణ నిర్ణయానికి ఇతర రాష్ట్రాలు సైతం సంఘీభావం తెలియజేస్తున్నాయని, పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారని చెప్పారు.

రాజధాని ప్రాంతంలోని నేలపాడు వద్ద నిర్మాణంలో ఉన్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ పనులను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ప్రతి బుధవారం తాను ఈ పనులపై సమీక్ష జరుపుతున్నానని, డిసెంబరు నెలాఖరు నాటికి జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లో జిల్లా కోర్టు పనులు పూర్తవుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నోటిఫికేషన్‌ ఇస్తే త్వరగా హైకోర్టు ఇక్కడికి తరలించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు ఈ కాంప్లెక్స్‌ పనుల గురించి న్యాయమూర్తులకు సీఆర్‌డీఏ అధికారులు తెలియజేస్తున్నారని సీఎం వివరించారు. హైకోర్టును తరలించిన తర్వాత శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలోనే ఓ ఉత్తమమైన రీతిలో రెండేళ్లలో శాశ్వత హైకోర్టు నిర్మాణం పూర్తి చేస్తామనే ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.