ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డ ఏపీ ముఖ్యమంత్రి...!

SMTV Desk 2018-10-26 11:40:03  JAGAN, CHANDRABABU NAIDU, KCR, KTR, MP KAVITHA, PAWAN KALYAN, GOVERNAR, ATTEMPT TO MURDER, CENTRAL GOVERNAMENT, CISF

అమరావతి, అక్టోబర్ 26: విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడికి తెదేపా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. గురువారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, దాడి జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, దాని వెనుక పెద్ద కుట్ర వుందని ప్రతిపక్ష నేతలు చేసిన విమర్శలపై బాబు మండిపడ్డారు.



అలాగే ''జగన్‌పై దాడి బాధాకరం. దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ, చేసింది ఎవరు? ఆయనకు వీరాభిమాని. ఈ సంఘటన జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో. అక్కడ భద్రత మొత్తం నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వ బలగాలు. అసలు విషయం ఇలా ఉండగా మేం కుట్రలు చేశామని మాపై పడటం ఏమిటి? నిజానికి కుట్ర మాకు వ్యతిరేకంగా జరిగింది. ఈ సంఘటనను అడ్డుపెట్టుకొని... రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, శాంతి భద్రతలు లేవనే సాకుతో ఏకంగా రాష్ట్రపతి పాలన విధించే వరకూ తీసుకువెళ్లాలని వ్యూహ రచన చేస్తున్నారు. కుట్రలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. ఎన్నింటినో ఎదుర్కొన్నాం. విజయులమై బయటకు వచ్చాం. ఎవరేం చేసినా మేం చూస్తూ కూర్చుంటామని అనుకోవద్దు. ప్రజలను కదిలిస్తాం. ప్రతిఘటిస్తాం'' అని. ''నేను హింసకు వ్యతిరేకిని. మా పార్టీ వాళ్లు చేసినా... ఇంకొకళ్లు చేసినా సహించను. అదే సమయంలో డ్రామాలు ఆడితే ఊరుకోను'' అని చంద్రబాబు తెలిపారు.

అంతే కాకుండా గవర్నర్ తీరుపై కూడా తొలిసారిగా మండిపడ్డారు. ''నేను ఎప్పుడూ గవర్నర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నా. జగన్‌పై ఆయన పార్టీ కార్యకర్త దాడి చేసిన ఘటన జరిగి వొక గంట కూడా గడవక ముందే గవర్నర్‌ రాష్ట్ర డీజీపీకి ఫోన్‌ చేశారు. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీకి ఆయన ఎలా ఫోన్‌ చేస్తారు? ఆయన ఏం అడిగినా రాష్ట్ర ప్రభుత్వాన్ని... నన్ను అడగాలి. నాతో మాట్లాడాలి. మా నుంచి సమాచారం తీసుకోవాలి. నేరుగా అధికారులకు ఫోన్‌ చేసి సమాచారం తీసుకొనే అధికారం ఆయనకు లేదు. ముఖ్యమంత్రిగా నా అనుభవం ఇప్పటికి పద్నాలుగేళ్లు! ఎవరి అధికారాల పరిధి ఏమిటో నాకు తెలుసు. మేం ప్రతి వ్యవస్థను గౌరవిస్తాం. కానీ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కిందా లేదు. కేంద్రం, రాష్ట్రం రెండూ వేటికి అవి స్వతంత్ర అధికార పరిధి కలిగిన ప్రభుత్వాలు. ఎవరి అధికారాలు... పరిధులు వాటికి ఉన్నాయి. రిమోట్‌ కంట్రోల్‌తో మమ్మల్ని పరిపాలించలేరు'' అని తీవ్రంగా వ్యతిరేఖించారు.

కాగా దాడి జరిగిన వెంటనే ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకుండా అక్కడినుండి ఎలా వెళ్ళిపోతారు అంటూ ప్రశ్నించారు.
''దాడి సంఘటన మధ్యాహ్నం 12. 40 నిమిషాలకు జరిగింది. వొంటి గంట విమానానికి ఆయన హైదరాబాద్‌ విమానం ఎక్కి వెళ్లి పోయారు. దాడి చేసిన నిందితుడిని సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకొని సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. నిబంధనల ప్రకారం బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాలి. ఆయన నుంచి ఫిర్యాదు తీసుకోవాలి. సంఘటన ఎలా జరిగిందో స్టేట్‌మెంట్‌ తీసుకోవాలి. జగన్‌ తనపై దాడి చేసిన నిందితుడిని క్షమిస్తే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, నిబంధనలు పాటించరా? ఆయన విమానం ఎక్కి వెళ్లిపోతుంటే సీఐఎ్‌సఎఫ్‌ అధికారులు ఎలా అనుమతించారు. గాయపడిన మనిషిని విమానంలోకి సిబ్బంది ఎలా అనుమతించారు?'' అంటూ వాపోయారు.

తరువాత జగన్ అక్కడినుండి ఎటు వెళ్ళాడు ఆపై ఏం చేసాడు అని అన్నింటిని వివరించారు. ''అపోలో ఆస్పత్రికి చెందిన వైద్యురాలు లలిత స్వాతి జగన్‌కు విశాఖ విమానాశ్రయంలో చికిత్స అందించారు. జగన్‌ ఎడమ భుజంపై అర సెంటీమీటర్‌ వెడల్పు, అర సెంటీమీటర్‌ లోతున గాయం ఏర్పడిందని... దానిని శుభ్రం చేసి కట్టుకట్టామని, గాయం మానడానికి యాంటీ బయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్‌ మందులు వేసుకోవాలని సూచించామని ఆమె అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత జగన్‌ విమానం ఎక్కి హైదరాబాద్‌ వెళ్లి అక్కడ నుంచి ఇంటికి కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీ వాళ్లు ఏం చెప్పారో, తర్వాత వొక ప్రైవేటు ఆస్పతికి వెళ్లి వాళ్లకు తోచింది రాయించుకొన్నారు. విమానంలో ఎక్కే ముందు నవ్వుతూ నమస్కారాలు పెడుతూ వెళ్లిన ఆయన ఇంటి నుంచి మళ్లీ ఆస్పత్రికి వెళ్లి జాలి గొలిపేలా పడుకొన్నారు'' అని బాబు గారు చెప్పుకొచ్చారు.

దాడికి పాల్పడిన శ్రీనివాస్ రావు గురించి కూడా చెప్పుకొచ్చారు. అతడు తమ పార్టీ మనిషి కాదు అని మీరు చెప్పగలరా అంటూ విమర్శలు చేసిన ప్రతిపక్ష నేతలను ప్రశ్నించాడు. ''దాడి చేసిన వ్యక్తి దానికి కారణం ఏమిటో పోలీసులకు చెప్పాడు. పోయిన ఎన్నికల్లోనే జగన్‌ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకొన్నానని, దాడి చేస్తే సానుభూతితో ఈసారైనా ముఖ్యమంత్రి అవుతాడని అనుకొన్నానని చెప్పాడు. పది పేజీల లేఖను కూడా తన వద్ద పెట్టుకొన్నాడు. తామంతా జగన్‌కు వీరాభిమానులమని అతని తండ్రి, తల్లి, సోదరుడు మీడియా ముందు స్వయంగా చెప్పారు. తమకు ప్రభుత్వం తరపున ఇల్లు ఇవ్వలేదని ఆ లేఖలో అతను రాశాడు. టీడీపీ వారు కాకపోయినా అతనికి ప్రభుత్వం తరఫున ఇల్లు వచ్చింది. ఇందులో మా వైఫల్యం ఎక్కడ? కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విమానాశ్రయంలో ఘటన జరిగింది. దానికి మా బాధ్యత ఉండదు. కానీ, విశాఖలో వంద మంది వైసీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేశారు. పులివెందులలో ఫ్లెక్సీలు తగలబెట్టారు. విశాఖలో క్రికెట్‌ పోటీలు జరుగుతున్నాయి. ఫిన్‌టెక్‌ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. వారందరూ తిరిగి వెళ్లే సమయంలో ఇవన్నీ చేశారు.'' అంటూ వెల్లడించారు.

జగన్ పై జరిగిన దాడికి స్పందించిన వారిని కూడా బాబు గారు నిలదీశారు.
సంఘటన జరిగిన గంటలోనే గవర్నర్‌, కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు, బీజేపీ నేతలు జీవీఎల్‌, రాం మాధవ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కొడుకు కేటీఆర్‌, కుమార్తె కవిత, పవన్‌ కల్యాణ్‌ వొకరి వెంట వొకరు ప్రకటనలు ఇచ్చి కమ్ముకొన్నారన్నారు. అంటూ ''తితలీ తుఫానుతో శ్రీకాకుళం కొట్టుకుపోతే కనీసం సంతాపం తెలిపే వోపిక కేసీఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు లేదు. కానీ.. జగన్‌ విషయంలో ఆగమేఘాలమీద స్పందించారు. జగన్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి భద్రత కల్పిస్తామన్నారు. వీరందరినీ ఎవరు నడిపిస్తున్నారు? సినీ నటుడు శివాజీ ఆరు నెలల కిందట ఆపరేషన్‌ గరుడ అని చెబితే అప్పుడు నేను పెద్దగా సీరియ్‌సగా తీసుకోలేదు. కానీ, ఇప్పుడు చూస్తే అవన్నీ వరుసగా జరుగుతున్నాయని అనిపిస్తోంది'' అని తెలిపారు.

అలాగే ''మేం బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఐటీ దాడులు లేవు. హోదా కోసం పోరాటం మొదలుపెట్టగానే అన్నీ మొదలయ్యాయి. జీవీఎల్‌ నుంచి జగన్‌ వరకూ... కేసీఆర్‌ నుంచి పవన్‌ వరకూ మాపై కమ్ముకొస్తున్నారు. వారు చేసే తప్పులు వారికే ఎదురు తిరుగుతాయి. ప్రజలు రోజూ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపకపోవచ్చు. కానీ, మనసులో ఉంచుకొంటారు. తగిన సమయంలో తీర్పు చెబుతారు'' అని స్పష్టం చేశారు.

''దాడి చేసింది వైసీపీ కార్యకర్త. దాడి జరిగింది ఆ పార్టీ నాయకుడిపైనా. వాళ్లు ఏం చెప్పుకుంటారు? మా పార్టీ కార్యకర్త, మా నాయకుడిపై దాడి చేశారని చెప్పుకోవాలి! జగన్‌ పై దాడి ఘటనలో వైఫల్యం లేదా అసమర్థత ఉందంటే అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. విమానాశ్రయం లోపల కేంద్ర ప్రభుత్వ బలగాలే భద్రత కల్పించాలి. కానీ, బీజేపీ నేతలు దీనిపై మాట్లాడరు! అగ్రిగోల్డ్‌ బాధితులు ఆరు రాష్ట్రాల్లో ఉన్నారు. బీజేపీ నేతలకు వారెవరూ కనిపించరు! కేసు మీకు ఇస్తాం. చేతనైతే మీరు దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయండి అంటే దానికి మాత్రం ముందుకు రారు!'' అని తెదేపా పార్టీ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసాడు