నవాజ్ షరీఫ్ అరెస్ట్..

SMTV Desk 2018-07-14 11:35:09  nawaz sharif, nawaz sharif arrest, pakistan former prime minister, nawaz sharif

పాకిస్తాన్, జూలై 14 : పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను, ఆయన కుమార్తె, రాజకీయ వారసురాలు మరియం షరీఫ్‌ను అరెస్ట్‌ చేశారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టి లండన్‌లో అత్యంత ఖరీదైన హైడ్‌ పార్క్‌ ప్రాంతంలో మూడు ఫ్లాట్‌లు కొనుగోలు చేసిన నేరంపై పాక్‌లోని కోర్టు నవాజ్‌ షరీఫ్‌కు పదేళ్లు, మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. శుక్రవారం రాత్రి లాహోర్‌ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఎదురుచూస్తున్న షరీఫ్‌ తల్లిని కలుసుకునేందుకు వారికి అనుమతిచ్చారు. తర్వాత ఇద్దరినీ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇస్లామాబాద్‌కు తరలించారు. అనంతరం షరీఫ్‌ను రావల్పిండిలోని అదియాలా జైలుకు, మరియమ్‌ను తాత్కాలిక సబ్‌జైలుగా ఏర్పాటుచేసిన సీహాలా రెస్ట్‌ హౌజ్‌కు తీసుకెళ్లారు. అటు పాకిస్థాన్‌ అంతటా తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. మూడు సార్లు ప్రధాని, ఒక పెద్ద రాజకీయ పక్షం-పీఎంఎల్‌ (ఎన్‌)కు అధినేత అయిన నవాజ్‌ షరీఫ్‌ను అరెస్ట్‌ చేయడంపై పార్టీ కార్యకర్తల్లో, ఓ వర్గం ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అనేక చోట్ల పోలీసుల వైఖరిని, ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకారులు వీధుల్లో ప్రదర్శనలు చేశారు.