ఏపీలో మంత్రివర్గ విస్తరణ మథనం..!

SMTV Desk 2018-07-05 11:41:41  ap cabinet extension, tdp leaders about cabinet, ap cm chandrababu naidu, amaravathi

అమరావతి, జూలై 5: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకోనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ముస్లిం, మైనార్టీలతో పాటు బలహీన వర్గాలతో పాటు.. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారికి మంత్రి పదవి కట్టబెట్టనున్నారా? అన్న ప్రశ్నలకు టీడీపీ శ్రేణులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న సంకేతాలతో తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలకు సమయం తక్కువగానే ఉన్నా మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రి పదవులకు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాలను ముస్లిం, మైనార్టీ, ఎస్టీ నేతలతో భర్తీ చేసే అవకాశాలను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసి వివిధ వర్గాలను సంతృప్తి పరచాలన్నది సీఎం అభిమతంగా అంచనా వేస్తున్నారు. ఉన్న రెండు స్థానాలకు చంద్రబాబు ఎవరికి మంత్రి పదవులు కట్టబెడతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.