ఏపీ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్..

SMTV Desk 2018-06-30 11:42:31  ap dgp rp thakur, ap new dgp rp thakur, andhra pradesh new dgp, ap new dgp

అమరావతి, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఠాకూర్ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. డీజీపీ రేసులో విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ గౌతం సవాంగ్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చిన, ముఖ్యమంత్రి చివరకు ఠాకూర్ వైపే మొగ్గు చూపారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన ఠాకూర్.. ఉమ్మడి రాష్ట్రంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. 1961 జులై 1న జన్మించిన ఆర్పీ ఠాకూరు పూర్తి పేరు రామ్‌ ప్రవేశ్‌ ఠాకూర్‌. ఐఐటీ కాన్పూర్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ చదివారు. 1986 డిసెంబర్‌ 15న ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో అదనపు ఎస్పీగా ఆయన తొలి నియామకం జరిగింది. గుంటూరు, వరంగల్‌ జిల్లాల్లో ఏఎస్పీగా, పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్‌ జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. జోనల్‌ హైదరాబాద్‌ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేశారు. 2016 నవంబర్‌ 19 నుంచి రాష్ట్ర అనిశా డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఏపీ రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య వీడ్కోలు సందర్భంగా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్‌లో 8 బెటాలియన్‌ సిబ్బంది పాల్గొన్నారు. వీరి నుంచి మాలకొండయ్య గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడం, రహదారి ప్రమాదాలు తగ్గించడం సంతృప్తినిచ్చాయన్నారు.