కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు : జీవీఎల్‌

SMTV Desk 2018-06-06 15:08:17  gvl narasimha rao, gvl comments on tdp, tdp vs bjp, amaravathi

విజయవాడ, జూన్ 6 : రాష్ట్ర్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ తమ రాజకీయ లభ్ది కోసం, కేంద్రప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. చంద్రబాబు తమపై ఆరోపణలు మానుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని వెల్లడించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తే అది వారికే అంటుకుంటుందని వ్యాఖ్యానించారు. ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో ఫోన్‌ సంభాషణలు వెలుగులోకి వస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని జీవీఎల్‌ ప్రశ్నించారు. ఈ అంశాన్ని రాజకీయంగా తాము లేవనెత్తలేదని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంబర్‌వన్‌గా ఉందని విమర్శించారు. చాలా రాష్ట్రాల్లో భాజపాను తక్కువగా అంచనా వేసిన పార్టీలు ఇప్పుడు తుడుచుపెట్టుకుపోయాయని.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి వస్తుందన్నారు. తెదేపా నేతలు చేసే ఆరోపణలను తాము పట్టించుకోమని.. రాష్ట్రంలో తమ పార్టీ అభివృద్ధి పైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందంటూ ఆయన ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాల్లో ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని.. కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ హబ్‌కి ఇప్పటివరకు రాష్ట్రం భూమి ఇవ్వలేదని పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధులిచ్చిందని.. అయితే అడ్డగోలుగా ఖర్చు చేయడం సబబు కాదని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.