కశ్మీర్ లో ఉగ్ర కలకలం

SMTV Desk 2017-07-11 17:26:55  JAMMU KASHMEER, AMARNAATH YAATRA, POLICE, TERRARIST, MODI, SONIA, ARUN JAITLE

శ్రీనగర్‌ జూలై 11 : పవిత్ర అమర్‌నాథ్‌యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు చెలరేగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో మెరుపు దాడి చేసి, ఏడుగురు యాత్రికులను బలితీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పోలీసులతో సహా మరో 11 మంది గాయపడ్డారు. అనంత్‌నాగ్‌కు సమీపంలోని బటంగూ ప్రాంతంలో, పోలీసులకు సంబంధించిన ఒక సాయుధ కారుపై రాత్రి 8.20 గంటలకు దాడి చేసిన ముష్కరులు, పోలీసులు ప్రతిఘటించడంతో విచక్షణ కోల్పోయి ఉన్మాదంతో కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అదే సమయంలో హైవే పైకి అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సు వచ్చింది. ఉగ్రవాదుల తూటాలు తగిలి కొంతమంది యాత్రికులు బలయ్యారు. వీరంతా యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. బస్సు డ్రైవర్‌, యాత్ర నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత యాత్ర బస్సులు హైవే మీద తిరగకూడదని చెప్పారు. అయితే ఉగ్రవాదుల లక్ష్యం భద్రతా దళాలేనని, యాత్రికులు కాదని తెలిపారు. ఈ దాడిని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఖండించారు. కశ్మీర్‌ చరిత్రలో ఈ రోజు చీకటి రోజని రాష్ట్ర మంత్రి నయీం అఖ్తర్‌ తెలిపారు. యాత్రికులను లక్ష్యంగా చేసుకోవడం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారని చెప్పారు. నిఘావర్గాల సమాచారం మేరకు కట్టుదిట్టమైన భద్రతల నడుమ వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29న ప్రారంభమైంది. ఈ ఏడాది యాత్ర కోసం 1.2 లక్షలమంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. బేస్‌క్యాంప్‌ మార్గంలో 6,000 మంది, పహల్గామ్‌ మార్గంలో 5,000 మంది బయలుదేరారు. యాత్ర భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం వేల మంది పారామిలటరీ దళాలను మోహరించింది. 45 రోజలు పాటు సాగే ఈ యాత్ర కోసం ఉపగ్రహ ఆధారిత గమన పరిశీలన వ్యవస్థ, డ్రోన్లు, సంచార బంకర్‌ వాహనాలు, రహదారులపై తనిఖీ చేసే బృందాలు వంటి వాటిని రంగంలోకి దించింది. ఈ ఏడాది 100 మంది పోలీసులను, 100-150 మంది అమర్‌నాథ్‌ యాత్రికులను ఉగ్రవాదుల లక్ష్యంగా చేసుకోనున్నట్లు నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఈ దాడిపై పలువురి స్పందన అరుణ్‌ జైట్లీ- ఉగ్రవాదుల దాడి తీవ్రమైన నేరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. సోనియా- శివభక్తులపై జరిగిన దాడి మానవత్వంపై చేసిన నేరపూరిత చర్య. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. మోదీ- ఇలాంటి పిరికిపంద దాడులకు, విద్వేష పూరిత వ్యూహాలకు లొంగిపోము. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాలా సాయం చేస్తాం. నా ఆలోచనలన్నీ తమ ప్రియమైన వ్యక్తులను కోల్పోయిన వారి చుట్టూ తిరుగుతున్నాయి. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్దిస్తున్నానని ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీ తెలిపారు