మలబార్ ప్రదర్శన, డ్రాగన్ ఆందోళన!

SMTV Desk 2017-07-11 12:52:09  MALABAAR, INDIA,AMERIKA, BHAARATH,CHINAA, JAPAAN, DRAAGAN,

చైనా, జూలై 11: భారత సరిహద్దుల్లో చైనా రోజురోజుకి రెచ్చిపోతుంది. దీనికోసం మలబార్ అనే విన్యాసాల పేరిట అమెరికా, భారత్‌, జపాన్‌లు భారీ నౌకా దళ విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం మూడు దేశాల మధ్య సైనిక సంబంధాలను మరింత పటిష్ఠపరచుకోవడం. ఈ నెల 17వరకూ ఈ యుద్ధ క్రీడలు కొనసాగుతాయి. ప్రతీసారి హిందు మహాసముద్రంలోకి వచ్చి వెళ్తూ చికాకు కలిగస్తున్న డ్రాగన్‌కు ఈ యుద్ధక్రీడలు అంతర్లీనంగా హెచ్చరికను పంపిస్తున్నాయి. ఈ విన్యాసాలను 1992 నుంచి భారత్‌, అమెరికాలు ఏటా హిందు మహాసముద్ర ప్రాంతంలో నిర్వహిస్తున్నాయి. 2007 నుంచి జపాన్‌ కూడా పలుమార్లు విన్యాసాల్లో పాల్గొంది. ఆ తర్వాత ఆ దేశానికీ శాశ్వత భాగస్వామి హోదా లభించింది. సముద్ర భద్రతకు సంబంధించి ఇండో-ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఉమ్మడి ముప్పులు పొంచి ఉండటంతో వీటిని నిర్వహిస్తున్నాయి. గత ఏడాది జూన్‌లో మొత్తం 11 యుద్ధనౌకలు, 8వేల మంది సిబ్బందితో భారీ విన్యాసాలను చేపట్టాయి. # బంగాళాఖాతంలో మూడు దేశాలకు సంబంధించి మొత్తం మీద 16 యుద్ధనౌకలు, రెండు జలాంతర్గాములు, 95 విమానాలు ఇందులో భాగమయ్యాయి. # అమెరికా తరపున- లక్ష టన్నుల బరువైన విమాన నౌక యూఎస్‌ఎస్‌ నిమిజ్‌, గైడెడ్‌ క్షిపణి క్రూజ్‌ నౌక యూఎస్‌ఎస్‌ ప్రిన్స్‌టన్‌, గైడెడ్‌ క్షిపణి విధ్వంసక నౌకలు యూఎస్‌ఎస్‌ హోవర్డ్‌, షౌప్‌, కిడ్‌, లాస్‌ ఏంజిలెస్‌ తరగతి జలాంతర్గామి, పి-8ఏ సముద్ర గస్తీ విమానాలు పాల్గొంటున్నాయి. # భారత్ తరపున- 45వేల టన్నుల విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, సైనికులను చేరవేసే ల్యాండింగ్‌ షిప్‌ జలాశ్వ, శివాలిక్‌ తరగతికి చెందిన రెండు ఫ్రిగేట్‌ యుద్ధనౌకలు, రెండు విధ్వంసక నౌకలు, కోరా తరగతికి చెందిన గైడెడ్‌ క్షిపణి కార్వెట్‌, ఇంధనాన్ని మోసుకెళ్లే ఐఎన్‌ఎస్‌ జ్యోతి, కమోర్తా తరగతికి చెందిన జలాంతర్గామి విధ్వంసక నౌకలు రెండు, పీ-8ఐ నిఘా విమానం భాగస్వామి అయ్యాయి. # జపాన్‌ తరఫున 27వేల టన్నుల బరువైన హెలికాప్టర్‌ వాహకనౌక జెఎస్‌ ఇజుమో, 6300 టన్నుల బరువైన జేఎస్‌ సజనామి పాల్గొంటున్నాయి. # అసలు ఎలా చేస్తారంటే! ఈ విన్యాసాల్లో భాగంగా సముద్రంపైన, లోపల, నేలపైనా పలు అభ్యాసాలు ఉంటాయి. ఉమ్మడిగా కార్యకలాపాల నిర్వహణపై దృష్టి ఉంటుంది. యుద్ధనౌకల్లోకి పరస్పరం సిబ్బందిని మార్పిడి చేసుకోవడం, సముద్ర గస్తీ, నిఘా, జలాంతర్గాముల వేట, వైద్యపరమైన కార్యకలాపాలు, నష్ట నివారణ, పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడం, హెలికాప్టర్‌ కార్యకలాపాలు, గగనతల రక్షణ విన్యాసాలు, గాయపడినవారిని తరలించే అభ్యాసాలు, కమ్యూనికేషన్‌ విన్యాసాలు, సైనిక ఆపరేషన్ల నిర్వహణ వంటివి ఉంటాయి. నేల మీద జరిగే వినాస్యాలకు చెన్నై వేదికవుతుంది. # చైనానే లక్ష్యంగా! జలాంతర్గాముల వేట, సాగర జలాల్లో దాగుండే శత్రు సబ్‌మెరైన్లను పసిగట్టే అభ్యాసాలను మూడు దేశాల నౌకా దళాలు చేపట్టనున్నాయి. ఇందుకోసం భారత్‌, అమెరికాలు పి-8 గస్తీ విమానాలను రంగంలోకి దించాయి. జలాంతర్గాములను వేటాడేందుకు వీటిలో అధునాతన పరిజ్ఞానం ఉంది. జపాన్‌ యుద్ధనౌక ఇజుమో కూడా ప్రధానంగా జలాంతర్గాముల పని పట్టడానికి ఉద్దేశించినవి, ఇవి 21వ విడత మలబార్‌ విన్యాసాల్లో ప్రధాన లక్ష్యాలు. ఇలా జలాంతర్గాములపై దృష్టిపెట్టడానికి కారణం హిందు మహాసముద్ర ప్రాంతంలో చైనా సబ్‌మెరైన్ల తాకిడి పెరగడం. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో పొరుగు దేశాల హక్కులన్నింటినీ కాలరాసిన చైనా.. ఆ ప్రాంతంపై దాదాపుగా పూర్తిస్థాయి పట్టును సాధించింది. దీంతో హిందు మహాసముద్రంపై దృష్టిసారించింది. భారత్ పై కూడా తన ఆధిపత్యం నెలకొనేలా చూడటం చైనా ఉద్దేశంగా కనపడుతోంది. మొత్తం మీద భారత్‌ను అన్నివైపుల నుంచి చుట్టుముట్టాలన్నది ‘డ్రాగన్‌’ వ్యూహంగా కనపడుతోంది. మరోవైపు చైనా-జపాన్‌ల మధ్య కూడా సముద్ర సరిహద్దుతోపాటు అనేక వివాదాలు ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా వ్యవహారశైలిపై అమెరికా ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో పైకి ఖండిస్తున్నప్పటికీ.. చైనాను లక్ష్యంగా చేసుకొనే ఈ విన్యాసాలను భారత్‌, అమెరికా, జపాన్‌లు చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది. # అమెరికా సందేశం మలబార్‌ విన్యాసాల ప్రారంభం నేపథ్యంలో విలేకరుల సమావేశంలో అమెరికా నౌకాదళ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ విలియం, డి బైర్న్‌ జూనియర్‌ మాట్లాడుతూ ఈ విన్యాసాలు ప్రపంచానికి గొప్ప ఉదాహరణలుగా మిగలబోతున్నాయని తెలిపారు. చైనాకు ఏదైనా వ్యూహాత్మక సందేశాన్ని ఇస్తున్నారా అన్న ప్రశ్నకు.. ‘‘చైనాకే కాదు.. అన్ని దేశాల నౌకాదళాలకు సందేశం ఇస్తున్నాం. ఐక్యంగా పని చేయడం ద్వారా పరస్పరం నేర్చుకోవవచ్చు’’ అని పేర్కొన్నారు. # ఆందోళనలో డ్రాగన్! మలబార్ విన్యాసాలు ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని అమెరికా, భారత్‌, జపాన్‌ చెబుతున్నప్పటికీ చైనా అనుమానాలు వీడలేదు. మలబార్‌ విన్యాసాలపై కన్నేసి ఉంచడానికి హైవాంగ్‌ జియాంగ్‌ అనే నిఘా నౌకను పంపింది. అధునాతన యువాన్‌ తరగతి డీజిల్‌-ఎలక్ట్రిక్‌ జలాంతర్గామి కూడా ఈ ప్రాంతంలో మోహరించింది. ‘‘సాధారణ ద్వైపాక్షిక సహకారానికి మేం వ్యతిరేకం కాదు అది మరో దేశాన్ని ఉద్దేశించి చేపట్టింది కాకూడదు. మలబార్‌ విన్యాసాలు ఏ దేశాన్నీ ఉద్దేశించి చేపడుతున్నవి కావని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ తెలిపారు.