ట్రంప్- కిమ్ భేటికు డేట్ ఫిక్స్..

SMTV Desk 2018-06-02 13:01:32  trump- kim jong un, america- north korea, trump singapore meeting, ovel office

వాషింగ్టన్, జూన్ 2 ‌: గత రెండు నెలలుగా ఉప్పు-నిప్పులా వ్యవహరించి ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్ భేటి తేది ఖరారైంది. సింగపూర్‌లో జూన్‌ 12వ తేదీన ఈ సమావేశం జరగనుందని డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఈ సమావేశం గురించి ఉ.కొరియా రాయబారి కిమ్‌ యోంగ్‌ చోల్‌తో వైట్‌హౌస్‌లోని ఓవల్‌ కార్యాలయంలో దాదాపు 80 నిమిషాల పాటు చర్చించిన అనంతరం ట్రంప్‌.. ఈ తేదీని ఖరారు చేశారు. ఉ.కొరియా నేత కిమ్ జోంగ్‌ ఉన్‌ పంపించిన లేఖను కిమ్‌ చోల్‌ ట్రంప్‌కు అందజేశారు. సమావేశం చాలా చక్కగా జరిగిందని, సింగపూర్‌లో జూన్‌ 12న కలుస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు. కొరియాను అణ్వస్త్ర రహితంగా మార్చడం ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనుంది. అయితే కొరియాను అణు రహితంగా మార్చడమనేది చాలా సుదీర్ఘమైన పనని ట్రంప్‌ అన్నారు. ‘ఇది చాలా పెద్ద ప్రక్రియ.. ఒక్క సమావేశంతో అయిపోయేది కాదు.’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు పెరగడం చాలా మంచి విషయమన్నారు. కిమ్ తో సమావేశం విజయవంతమవుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు.