ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే : చంద్రబాబు

SMTV Desk 2018-05-28 13:42:04  chandrababu naidu, ntr bharata ratna, #95 th ntr anniversary, mahanadu

విజయవాడ, మే 28: పేదరికం లేని సమాజం చూడాలని ఎన్టీఆర్‌ కలలు కన్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమాజానికి ఎనలేని సేవ చేసిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకివ్వరని కేంద్రాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. సోమవారం ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని మహానాడులో సీఎం ప్రసంగించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అన్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ మాత్రమేనని చంద్రబాబు అన్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా తెరకెక్కించాలన్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..." ఎన్నో సంస్కరణలకు ఎన్టీఆర్ నాంది పలికారు. తెలుగు వారి ఆత్మ గౌరవానికి ఆయన ప్రతీకగా నిలిచారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం కావాలి. ప్రతి ఒక కార్యకర్త ఒక ఎన్టీఆర్ కావాలి. చరిత్రలో ఎంతో మంది పుడతారు. కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేది మాత్రం కొందరే. అలాంటి వారిలో ఎన్టీఆర్‌ అగ్రగణ్యులు. నేను ఎన్టీఆర్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.