ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం : ఐఎండీ

SMTV Desk 2018-05-18 16:07:03  imd, indian metrological department, massive rains, andhrapradesh

అమరావతి, మే 18 : జమ్మూకశ్మీర్-పాకిస్తాన్‌ వైపుగా హర్యానా- విదర్భల వరకూ విస్తరించిన పశ్చిమ అలజడి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పిడుగులతో కూడిన జల్లులు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలియచేసింది. మధ్య మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లోని కొన్ని చోట్ల క్యుములోనింబస్ మేఘాల కారణంగా చాలా చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఈడెన్ వద్ద ఏర్పడిన తుపాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతం యెమెన్‌కు 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. తుపానుకు సమీపంలోని ప్రాంతాల్లో 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయింది. అమరావతిలో 39, గుంటూరులో 40, ఒంగోలులో 39, రాజమహేంద్రవరంలో 41, విశాఖపట్నంలో 37, విజయనగరంలో 39, శ్రీకాకుళంలో 39, ఏలూరులో 39, కాకినాడలో 38, తిరుపతిలో 40, నెల్లూరులో 40, కర్నూలులో 42, కడపలో 41, అనంతపురంలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.