డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ!

SMTV Desk 2018-04-29 13:08:46  Replacement of teacher posts DSC notification ganta srinivasa rao

విశాఖపట్నం, ఏప్రిల్ 29: రాష్ట్రంలో డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జూలై ఆరో తేదీన విడుదల చేస్తామని మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. డీఎస్సీ ద్వారా 10,351 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఆయన శనివారం విశాఖలో డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిసారిగా ఏపీపీఎస్సీ ద్వారా ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, లాంగ్వేజ్‌ పండిట్లు, పీఈటీలు, మ్యూజిక్‌/డ్యాన్స్, మోడల్‌ స్కూల్‌ టీచర్లుగా ఆరు కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. జూలై 7 నుంచి ఆగస్టు 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు ఒకటిన ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తామని, ఆగస్టు 15 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. డీఎస్సీ రాత పరీక్షలు ఆగస్టు 23 నుంచి 30 వరకు ఉదయం 9.30 నుంచి 12 మధ్య, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల మధ్య నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 31న ప్రాథమిక కీ, సెప్టెంబర్‌ 9న ఫైనల్‌ కీ విడుదల చేస్తామని, సెప్టెంబర్‌ 15న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.