లారీ బీభత్సం..నలుగురు మృతి

SMTV Desk 2018-04-26 16:48:28  Lorry accident, Band group 4 members, death

పీలేరు, ఏప్రిల్ 26: చిత్తూరు జిల్లా తానా వడ్డిపల్లిలో జరుగుతున్న నల్లగంగమ్మ జాతరకు వచ్చి తిరిగివెళ్తున్న డప్పు కళాకారులపైకి సిమెంటు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కళాకారులు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా....మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను నారాయణ, జయరాం, గుర్రప్ప, వెంకటరమణగా గుర్తించారు. వీరంతా నిమ్మనిపల్లి మండలం కొండసానిపల్లికి చెందిన వారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతర తిలకించి రోడ్డుపై తిరిగి వెళ్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ కళాకారులపై దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. డ్రైవర్ నిద్రమత్తు కావడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.