మిత్రుల వేధింపులు తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

SMTV Desk 2018-03-11 11:03:28  secundrabad, crime news, SI varunkanth reddy.

సికింద్రాబాద్‌, మార్చి 11: ఆపదలో ఉన్న మిత్రులను ఆదుకునేందుకు బంగారు గొలుసునిస్తే, తిరిగివ్వకుండా వేధిస్తున్నారనే మనస్తాపంతో ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్కర్‌, ఎస్సై వరుణ్‌కాంత్‌రెడ్డి కథనం ప్రకారం.. బౌద్ధనగర్‌ వారాసిగూడకు చెందిన సాయిచరణ్‌(21) నగరంలోని ఓ కాలేజీలో బీకామ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఓయూ సిటీ అంగడిబజార్‌కు చెందిన జి.నాగరాజు(26), మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన రాజేష్‌(27)లతో పరిచయమై మిత్రులుగా మారారు. రాజేష్‌, నాగరాజు గతేడాది దీపావళి పండుగకు టపాకాయల దుకాణం పెట్టి నష్టపోయారు. అప్పులు తీర్చేందుకు సాయిచరణ్‌ను సంప్రదించగా తన ఇరవై గ్రాముల బంగారు గొలుసును ఇచ్చాడు. తిరిగి ఇచ్చే విషయంలో తరుచూ గొడవలు జరుగుతుండేవి. రెండు రోజుల కిందట గొలుసు కోసం మళ్లీ అందరి మధ్య గొడవ జరగడంతో తన గొలుసు ఇవ్వరేమోననే మనస్తాపానికి లోనైన సాయిచరణ్‌ ఈ నెల 9న అర్థరాత్రి తన గదిలో ఫ్యానుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు, రాజేష్‌ల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సాయిచరణ్‌ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న నేపథ్యంలో ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.