కెల్విన్ తో సంబంధాలపై పూరీ...

SMTV Desk 2017-07-19 16:21:41  director puri jagannath, drugs case, questions

హైదరాబాద్,జూలై 19 : టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ మాదకద్రవ్యాల కేసులో భాగంగా సిట్‌ అధికారుల విచారణ ఈ ఉదయం నుంచి కొనసాగుతోంది. ఈ విచారణలో భాగంగా ఉదయం 10 గంటలకు నాంపల్లి ఆబ్కారీ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి పూరీ జగన్నాథ్‌ తన కుమారుడు ఆకాశ్‌, సోదరుడు సాయి రామ్‌లతో కలిసి వచ్చారు. సిట్‌ కార్యాలయంలోని ఐదో అంతస్తులో పూరీని విచారిస్తున్నారు. అకున్‌ సబర్వాల్‌ పర్యవేక్షణలో నలుగురు అధికారుల బృందం ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చూసినప్పుడు కెల్విన్‌తో ఉన్న సంబంధాలపైనే ప్రధానంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఓ ఈవెంట్ సందర్భంగా పబ్‌లో కెల్విన్‌ను కలిశానని, తనకు కెల్విన్‌కు మధ్య రెగ్యులర్‌గా ఎలాంటి సంభాషణలు జరగడం లేదని పూరి చెప్పినట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటలపాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు కావాలని భావిస్తే విచారణ సమయం పెంచే అవకాశం ఉంది. కెల్విన్‌తో ఉన్న సంబంధాలు, సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వాడకంపై ఇతర కోణాల్లో దర్యాప్తు చేసేందుకే ఈ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన సమాచారాన్ని తదుపరి దర్యాప్తునకు ఉపయోగించుకొని, ఆయనను సాక్షిగా పేర్కొనే అంశంపై అధికారులు ఓ నిర్థారణకు రానున్నారు. మాదకద్రవ్యాల ముఠాతో ఎలాంటి సంబంధం లేదని పూరీ ఇప్పటికే అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. సిట్ అధికారులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు తడబాటు లేకుండా పూరీ సమాధానం చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.