40 రోజుల తరువాత వీడిన ఉత్కంఠ...

SMTV Desk 2017-07-17 10:57:01  The, Poornima Sai, tragedy, was, screened, after, 40, days

హైదరాబాద్, జూలై 17 : హైదరాబాద్ లో గత 40 రోజుల క్రితం అదృశ్యమైన పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యమైంది. అనాథనని చెప్పుకొని ముంబాయి దాధర్ సమీపంలోని ఓ ఆశ్రమంలో మారు పేరుతో ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. పోలీసులు కథనం ప్రకారం... హైదరాబాద్ నిజాంపేట్ లోని అమృత సాయి రెసిడెన్సి లోని నివాసముంటున్న నాగరాజు, విజయ కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు వారిలో పెద్ద కూతురు పూర్ణిమ సాయి (15) స్థానిక ప్రైవేట్ స్కూల్ లో పదవ తరగతి చదువుతుంది. గత నెల 7 న స్కూల్ కు వెళ్లి వస్తానని చెప్పి మళ్లీ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాలతో పాటు షిరిడీ, పుణే తదితర రాష్ట్రాల్లో కూడా వెతికించారు. ఎంత వెతికిన ఆచూకీ తెలియకపోవడంతో ఈ నెల 13న దీనిని కిడ్నాప్ కేసు కిందకు మార్చారు. అయితే పూర్ణిమ సాయి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి తోనే ముంబాయి వెళ్లి దాదర్ లోని ఓ స్టూడియో వద్ద ఉండగా పోలీసులు చూసి ఎవరు నువ్వు అని అడిగితె అనాథనని చెప్పడంతో పోలీసులు పూర్ణిమ ను డొంగరి లోని బలసుధార్ లో ఉన్న ఓ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ పూర్ణిమ అసలు పేరుతో కాకుండా అన్వికశ్రీ గా పేరు మార్చుకొని హైదరాబాద్ లోని తుకారం గేట్ లోని సాయిశ్రీ అనాథాశ్రమం నుంచి వచ్చానని పేర్కొంది. దాధర్ లోని పోలీసులు బాలిక ఫోటోను ముంబాయి గోడలకు అంటించారు. ఆదివారం తుకారం గేట్ సీఐ రమేష్ సమాచారం అందించారు. 40 రోజులుగా కూతురు ఆచూకి తెలియకపోవడంతో తల్లిదండ్రులు కుమిలిపోయారు. ఆదివారం రోజున పూర్ణిమ పుట్టిన రోజున సాయంత్రం క్షేమ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేడు పోలీసులు, తల్లిదండ్రులతో ముంబాయి వెళ్లి పూర్ణిమ ను తీసుకురానున్నట్లు సీఐ బాలకిషన్ వెల్లడించారు.