మూడు వారాలైన మృతదేహం ఫ్రీజర్ లోనే..

SMTV Desk 2017-07-13 13:11:31  GANGSTER, POLICE, ENCOUNTER, CBI, RAAJASTHAAN, NAAGOWR,

నాగౌర్, జూలై 13: రాజస్థాన్‌లోని నాగౌర్‌ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో 20 మంది పోలీసులు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌ జరిగి మూడు వారాలు గడుస్తున్నా గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్‌ పాల్‌ సింగ్‌ మృతదేహానికి ఇంకా అంత్యక్రియలు జరిపించలేదు. 20 రోజులుగా మృతదేహాన్ని ఫ్రీజర్‌లోనే ఉంచారు. వివరాలలోకి వెళితే, రాజ్‌పుత్‌ కమ్యూనిటీకి చెందిన ఆనంద్‌ పాల్‌ సింగ్‌ రాజస్థాన్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌. ఇతనిపై 1992 నుంచి 2017 వరకు 40కేసులుండగా.. అందులో ఆరు హత్య కేసులున్నాయి. కాగా 2012లో ఆనంద్‌ను అరెస్టు చేయగా.. 2015లో పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతూ గత నెల 24న పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అతడు పోలీసులపైకి కాల్పులు జరుపగా, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆనంద్‌ కుటుంబసభ్యులు.. పోలీసులపైకి రాళ్లు విసరడమేగాక, ఓ అధికారి వాహనానికి, నాలుగు బస్సులకు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రబ్బరు బులెట్లు ఉపయోగించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.