కలకలం రేపుతున్న 7 కిలోల బంగారం చోరీ

SMTV Desk 2017-07-12 11:18:14  VIJAYAWAADA, POLICE, KHAARKAANAA, GOLD, THIEF, HYDERAABAD, GUNTUR, VIZAAG, TRAIN

విజయవాడ, జూలై 12 : విజయవాడ నగరంలో భారీ బంగారం దోపిడీ తీవ్ర కలకలం సృష్టించింది. బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో సుమారు 10 మంది దోపిడీ దొంగలు కత్తులు, తుపాకులతో బెదిరించి 7 కిలోల బంగారంతో ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ బంగ్లాకు చెందిన శంకర్‌మన్నా, సుభాష్‌ మన్నాలు అన్నదమ్ములు. వీరు గోపాలరెడ్డి రోడ్డులోని మహంతి చేపల మార్కెట్‌ పక్కనున్న భవనం మొదటి అంతస్తులోని కార్ఖానాలో రాత్రంతా బంగారు నగలు తయారు చేసి దుకాణాలకు విక్రయిస్తుంటారు. అదేవిధంగా మంగళవారం రాత్రి దాదాపు కార్ఖానాలో 15 మంది పనిచేస్తుండగా, సుమారు 10 మంది దుండగులు అక్కడకి వచ్చి తుపాకులు గురిపెట్టి చంపుతామని బెదిరించి బీరువాలో ఉన్న 7 కిలోల బంగారాన్ని తీసుకుని పరారయ్యారు. యజమాని సుభాష్‌ మన్నా దొంగదొంగ అంటూ వెంటపడినా ఫలితం లేకపోయింది. కార్ఖానా సమీపంలో దుండగులు ఉంచిన మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ నెంబరు గల కారులో పారిపాయినట్లు సమాచారం. ఈ మేరకు జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు బి.వి. రమణకుమార్‌, డీసీపీ గజరావుభూపాల్‌లు సిబ్బందితో అక్కడకు చేరుకొని, దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. రైలులో పరారయ్యే అవకాశం ఉండటంతో గుంటూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం వైపు వెళ్లే అన్ని రైళ్ళపై నిఘా ఉంచి సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని, అన్ని చెక్ పోస్ట్ ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు.