నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

SMTV Desk 2017-07-07 18:42:28  rangareddy, Contractor, Bali

రంగారెడ్డి, జూలై 7 : ఒకరి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలైంది. ఎలాంటి హెచ్చరిక బోర్డ్ లు పెట్టకుండా రోడ్డు పక్కనే గుంతలు తీసి వదిలేసారు. ఆ గుంతలో పడి ఒక వ్యక్తి ప్రాణాల్ని కోల్పోయాడు. వివరాలలోకి వెళితే, మొయినాబాద్ మండలం యెంకే గ్రామానికి చెందిన కావలి కృష్ణ (26) ప్రమాదవశాత్తు హైద్రాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పక్కనున్న గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కావలి కృష్ణ, షాబాద్ మండలం సోలిపెట్ గ్రామంలోని తన అత్తగారింటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇతని మృతితో యెంకేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందాపూర్ గ్రామం నుండి హైద్రాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి వరకు డబుల్ లైన్ రోడ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల నిమిత్తం తీసిన గుంతల పక్కన ఎలాంటి హెచ్చరిక బోర్డ్ లు పెట్టలేదు.సాధారణంగా ఎక్కడైనా రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు ఆ ప్రక్కనే ప్రత్యామ్నాయంగా ఇంకో రోడ్డు వేస్తారు. కానీ ఇక్కడ 500 మీటర్ల రోడ్డు కోసం 5 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లే ప్రత్యామ్నాయ రోడ్డు వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ రోడ్డు కూడా వర్షం పడితే జారిపడి, గాయాలపాలయ్యే రోడ్డు అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్లు ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.