ఉద్యోగాల పేరిట రూ. 30 లక్షలు టోకరా..

SMTV Desk 2017-07-07 14:22:29  fake, jobs, karimnagar

కరీంనగర్, జూలై 7 : ఉద్యోగాల పేరుతో సామాన్య ప్రజలను నమ్మించి 30 లక్షలు వసూలు చేసిన ఐదుగురు వ్యక్తుల ముఠాను కరీంనగర్‌ మూడో ఠాణా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ వీబీ కమలహాసన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ వాటర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, 28 మంది వద్ద సుమారుగా రూ.30 లక్షల వరకు వసూలు చేసిన ముఠాలో మమహ్మద్‌ చాంద్‌పాషా, ఐలేని సాయిచంద్‌, పల్లెర్ల రంజిత్‌, కొత్తకొండ రాజేంద్రప్రాద్‌, నర్సింగోజు శ్రీధర్‌ అను వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపడుతున్న ఉద్యోగాల నియామక ప్రకటనలను ఆసరాగా చేసుకొని డబ్బు వసూలు చేయాలని పథకం రచించారు. ఈ ముఠాకు ప్రధాన నాయకుడైన చాంద్‌పాషా గతంలోనూ వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసి పట్టుబడ్డాడు. జైలు నుంచి విడుదల అయ్యాక మళ్లీ అదే తరహాలో మోసాలు మొదలుపెట్టాడు. వీరంతా కలిసి కరీంనగర్‌ శివారులోని నగునూర్‌ దాబాలో పాగా వేశారు. మొదటగా నిరుద్యోగులను గుర్తించి వారి సర్టిఫికెట్లు, వివరాలు తీసుకున్న తర్వాత మొదటి దఫాగా రూ.15 వేలు (డీడీ కోసం), పైరవీకి మరో రూ.80 వేలు, రెండవధఫాగా అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందిన తర్వాత మరో రూ.80 వేలు వసూలు చేశారు. వసూలు చేసిన డబ్బులు పంచుకొని వాహనాలు కొన్నారు. మొదట అవుట్‌సోర్సింగ్‌, ఆ తర్వాత పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్స్ సృష్టించారు. ఆఫర్ లెటర్లు కార్యాలయాల్లో కాకుండా సిద్దిపేట జిల్లాలో, కారులో అందజేయడం గమనార్హం. బాధితులకు అనుమానం రాకుండా మొదటి నెల వేతనంగా రూ.22 వేలు వారి ఖాతాల్లో జమ చేశారు. కాని ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ లెటర్లలో ఉద్యోగం ఎక్కడనేది లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా చాంద్‌పాషా ముఠా మోసం బయటపడింది. వారి వద్ద నుంచి రూ.15 వేల నగదు, ఇండికా కారు, టాటా సుమో, ఆటో, 5 సెల్‌ఫోన్లు, నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు, ఐడీ కార్డులు, స్టాంపు, కంప్యూటర్‌, ప్రింటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.