వ్యవసాయశాఖలో ఏఈవో పోస్టుల జారీ

SMTV Desk 2017-07-04 16:24:27  Aeo, Agriculture, Issued by posts, Ruling,753 Aao Post

హైదరాబాద్, జూలై 4 : తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల జారీకి వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) భర్తీకి సర్కారు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ పోస్టులను టీఎస్ పీఎస్ ద్వారా భర్తీ చేయడానికి అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ప్రతి 5వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉండేలా కొత్తగా మరో 526 ఏఈవో పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో సర్కారు ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈవో నియమకానికి వీలుగా వెయ్యి పోస్టులను సృష్టించింది. వాటికి తోడుగా 311 ఏఈవో ఖాళీలు కలుపుకుని మొత్తం 1311 పోస్టులు ఇటీవల భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ తర్వాత రాష్ట్రంలోని సాగు విస్తీర్ణానికి ప్రతి ఏఈవో పరిధిలోకి 7 వేల ఎకరాల వరకు వస్తోందని అధికారులు తెలిపారు. మరో 526 పోస్టులను సృష్టించాల్సిందిగా వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది. ఈ మధ్య కాలంలో 227 ఏఈవో పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీలతో కొత్తగా సృష్టించిన పోస్టులను కలిపి మొత్తం 753 ఏఈవో పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. వ్యవసాయశాఖలో బలోపేతానికిగాను మరో 200 కొత్త పోస్టులను సృష్టించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలు, మండలాల విభజనతో కొత్తగా 25 డివిజన్లు, 125 మండలాలు ఏర్పడాయి. ఈ మేరకు శనివారం వ్యవసాయం పైన ప్రగతి భవన్ లో జరిగిన సమీక్ష సందర్భంగా సిబ్బంది కొరత ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా కమిషనరేట్, ఇతర హెచ్ వోడీ ల బలోపేతం కోసం 200 వరకు కొత్త పోస్టులను మంజూరు చేయడానికి సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు తెలిసింది. కొత్తగా సృష్టించే పోస్టుల్లో పదోన్నతుల తర్వాత కింది స్థాయి పోస్టుల్లో ఏర్పడ్డ ఖాళీలను టీఎస్ పీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి.