మహిళా ఎమ్మార్వో సజీవ దహనం...వీడియో

SMTV Desk 2019-11-04 17:18:48  

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటు చేసుకుంది. తహశీల్దార్ విజయారెడ్డిని ఓ వ్యక్తి ఆఫీసులోనే సజీవదహనం చేశాడు. ఆమె కేకలు వేసుకుంటూ బయటకు రావడంతో ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎమ్మార్వోను కాపాడేందుకు యత్నించిన ఆమె కారు డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మంటల్లో శరీరం మొత్తం కాలిపోవడంతో విజయారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం నిందితుడు కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. కాలిన గాయాలతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడు సుమారు అరగంట పాటు ఎమ్మార్వోతో మాట్లాడాడని, అతడు బయటకు వెళ్లిన వెంటనే విజయారెడ్డి మంటల్లో కాలుతూ కేకలు వేసుకుంటూ బయటకు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిందితుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా ఎమ్మార్వోను ఆఫీసులోనే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి అక్కడ తొలి ఎమ్మార్వోగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆమె స్వస్థలం సూర్యాపేట జిల్లా నకిరేకల్ మండలం తోటపల్లి. పాస్‌బుక్ వ్యవహారంలో సురేశ్ ఎమ్మార్వోతో గొడవపడి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమాచారం అందుకోగానే జిల్లా కలెక్టర్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మార్వో ఆఫీసులకు బయలుదేరారు. జిల్లాకు చెందిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఘటనపై ఆరా తీశారు. మహిళా ఎమ్మార్వో విజయారెడ్డిని ఆఫీసులో సజీవ దహనం చేసిన ఘటనపై తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు, తహసీల్దార్ల సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన ఘటన అని, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకే రక్షణ లేకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత వంగా రవీందర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పట్టపగలే కార్యాలయంలోనే ఓ మహిళా తహసీల్దార్‌ను సజీవ దహనం చేశారంటే అంతకంటే పైశాచికం ఏముంటుందని తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు గౌతమ్ అన్నారు.