కేసీఆర్ ఏడాది పాలన...ఎలా ఉందటే!

SMTV Desk 2019-12-13 11:44:49  

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండో దఫా బాధ్యతలు చేపట్టి డిసెంబర్ 13కి ఏడాది పూర్తయ్యింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. ఘన విజయం సాధించిన టీఆర్ఎస్‌లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. తొలి కేబినెట్‌లో మహిళలకు చోటు లేదనే అపవాదు ఉండగా.. రెండోసారి దాన్ని కేసీఆర్ చెరిపివేశారు. కాంగ్రెస్‌ను చీల్చిన ఆయన ప్రతిపక్షాన్ని బలహీనపరిచారు. తొలి ఐదేళ్ల పాలనలో కేసీఆర్‌లోని ఓ పార్శ్వాన్ని మాత్రమే చూసిన తెలంగాణ ప్రజానీకం, రాజకీయ పార్టీలు.. ఇప్పుడు రెండో వైపు చూస్తున్నాయి. కేసీఆర్ పాలన ఎలా సాగిందో ఓసారి చూద్దాం..2018 డిసెంబర్‌ 13న కేసీఆర్‌ సీఎంగా ప్రమాణం చేయగా.. తొలి టర్మ్‌లో డిప్యూటీ సీఎంగా పని చేసిన మహమూద్‌ అలీ హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి గెలిచిన వెంటనే కేటీఆర్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. 2019 ఫిబ్రవరిలో మంత్రి వర్గాన్ని విస్తరించిన కేసీఆర్ పది మందికి మంత్రివర్గంలో చోటిచ్చారు. కానీ కేటీఆర్, హరీశ్ రావులకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు.సెప్టెంబర్‌‌లో మూడోసారి కేసీఆర్‌ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈసారి హరీశ్‌రావు, కేటీఆర్‌తోపాటు.. గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌‌లకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. కేసీఆర్ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలకు తెరదించారు. హరీశ్‌కు కీలకమైన ఆర్థిక శాఖ ఇవ్వడం ద్వారా మేనల్లుడిని కేసీఆర్ పక్కనెట్టారనే ఊహాగానాలకు తెరదించారు.ముందస్తు ఎన్నికల్లో 88 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. మిగతా పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం సెంచరీ మార్క్ దాటింది. కాంగ్రెస్‌ నుంచి 19 మంది గెలుపొందగా, 12 మంది టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. దీంతో ఈ ఏడాది జూన్‌లో కాంగ్రెస్‌ శాసనసభా పక్షం విలీనమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క సీటుకు మాత్రమే పరిమితం కాగా.. వలసలతో ఇప్పుడు ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు ఇద్దరు, టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్‌కు లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒకింత నిరాశాజనకమైన ఫలితాలు వెలువడ్డాయి. 17 లోక్ సభ స్థానాలకు గానూ.. 16 చోట్ల గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉండగా.. 9 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. కేసీఆర్ కుమార్తె కవిత సైతం ఓడిపోయారు. బీజేపీ నాలుగు స్థానాల్లో.. కాంగ్రెస్ మూడు స్థానాల్లో, ఎంఐఎం ఒక్క చోట విజయం సాధించాయి. తర్వాత జెడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.తొలి ఐదేళ్ల పాలనలో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు... రెండోసారి అధికారంలోకి వచ్చాక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పరిపాలిస్తోందని చెప్పొచ్చు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కూడా సకాలంలో అందడం లేదు. దీంతో అనవసర ఖర్చులకు కత్తెర వేసే పనిలో కేసీఆర్ పడ్డారు. దీంతో మొదటి టర్మ్‌తో పోలిస్తే.. రెండోసారి సంక్షేమానికి ప్రాధాన్యం తగ్గించారని భావించొచ్చు.తొలిసారి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే ఆసరా ఫించన్లను పెంచింది. డిసెంబర్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కారు.. జూలై నెల నుంచి ఫించన్ల పెంపు వర్తింపజేసింది. రైతు బంధును పెంచిన సర్కారు.. రూ.5 లక్షల రైతు బీమాను ప్రకటించింది.తెలంగాణకు జీవనాడి లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ ఏడాది జూన్ 21న ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. రూ.80 వేల కోట్ల అంచనాలతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఆర్థిక భారమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ.. కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలోని 13 జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పీసీసీ చీఫ్ ఉత్తమ్ భార్య పద్మావతిని ఆయన భారీ తేడాతో ఓడించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తన పట్ల ప్రజాదరణ చెక్కు చెదర్లేదని నిరూపించారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. 52 రోజులపాటు సమ్మె చేసినా.. కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. తీవ్ర ఒత్తిడిలోనూ ఆయన చాకచక్యంగా వ్యవహరించారు. ఈ విషయంలో హైకోర్టు కూడా చేతులెత్తేయడంతో కార్మికులు విధుల్లో చేరతామంటూ బతిమాలుకోవాల్సి వచ్చింది. ఆర్టీసీ కార్మిక సంఘాలదే ఈ తప్పన్న సీఎం.. కార్మికులతో కలిసి తన నివాసంలో భోజనం చేశారు. కార్మికులు చేసిన హేతుబద్ధమైన డిమాండ్లు నెరవేర్చడానికి అంగీకరించారు.ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పేర్కొనట్టుగా నిరుద్యోగ భృతిని ఇప్పటి వరకూ ఇవ్వడం లేదు. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ సర్కారు పనితీరు ఆశించిన రీతిలో లేదనే భావన ఉంది. పొరుగు రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం కూడా దీనికి కారణం కావొచ్చు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం.. తదితర హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకబడింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా ఇంకా అమలు కాలేదు. ఆర్టీసీ ఛార్జీల పెంపు వడ్డనను కూడా ప్రజలు భారంగా భావిస్తున్నారు.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కేంద్రంతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా ఆయన ప్రధానిని ఆహ్వానించలేదు. డిసెంబర్లో గెలిచిన ఆయన.. తొలిసారి అక్టోబర్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. బీజేపీతో సంబంధాలను పునరుద్ధరించుకోవడం కుదరకపోవడంతో... సందర్భానుసారంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటేసింది.మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్‌తో ఆయన సన్నిహిత సంబంధాలను నెరుపుతున్నారు. జగన్ అధికారంలోకి రావడానికి కేసీఆర్ తన వంతు సాయం అందించారు. జగన్‌తో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని భావించినా కుదరలేదు. తెలంగాణ భూభాగం మీదుగా నదుల అనుసంధానం దిశగా ఆలోచించినా.. అది ముందుకెళ్లలేదు.మొత్తంగా కేసీఆర్ తొలి ఏడాది పాలనను చూస్తే.. ప్రతిపక్షం బలహీన పడటం ఆయనకు కలిసొచ్చింది. చాకచక్యంగా వ్యవహరించి ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఆయన తేలిగ్గా బయటపడ్డారు. తెలంగాణలో జెండా ఎగరేడమే లక్ష్యంగా దూసుకొస్తున్న బీజేపీని రాబోయే రోజుల్లో ఆయన ఎలా ఎదుర్కొంటారనేదే కీలకంగా మారనుంది.