ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలదే పైచేయి: కడియం

SMTV Desk 2018-04-13 13:05:44   Government Gives Top Priority To Education, Kadiyam

హైదరాబాద్‌, ఏప్రిల్ 13: ఇంటర్‌ ఫలితాల్లో కార్పొరేట్‌ కాలేజీల కన్నా ప్రభుత్వ కళాశాలలు ముందున్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రహించాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకై దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు రూ.3 కోట్లు ఖర్చుపెట్టి 26 కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రతియేడు ఇంటర్‌ సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్‌ చదువుల మోజులో పడి డబ్బుని, విద్యార్థుల విలువైన సమయాన్ని వృథా చేయొద్దని కడియం శ్రీహరి సూచించారు. తల్లిదండ్రుల మైండ్‌సెట్‌ మారినపుడే విద్య కార్పొరేట్‌ మయం కాకుండా అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.కార్పొరేట్‌ కాలేజీల్లో ర్యాంకుల పేరిట విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించామని, కోచింగ్‌ల పేరిట ఎవరైన వేసవిలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.