రైతులకు ఉచిత పెట్టుబడి..

SMTV Desk 2018-03-20 12:14:45  telangana, farmers, free investment, PS. joshi

హైదరాబాద్, మార్చి 19: రైతులకు ఉచిత పెట్టుబడిని అందించే పథకాన్ని వచ్చే నెల 19న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి వెల్లడించారు. ఆలోగా భూ ప్రక్షాళన కార్యక్రమంలో ఆధునీకరించిన భూ వివరాలను ఈ నెల 28లోగా వ్యవసాయశాఖకు అందించాల్సిందిగా రెవిన్యూశాఖను సిఎస్ ఆదేశించారు. సచివాలయంలో సోమవారం వ్యవసాయానికి ఉచిత పెట్టుబడిని అందించే కార్యక్రమంపై రెవిన్యూ, వ్యవసాయ, ఆర్థిక, ఎన్‌ఐసి అధికారులతో సిఎస్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా భూ విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఖాతాలు, రైతుల వివరాలను తహసీల్దార్లు ధ్రువీకరించి కలక్టర్లకు సమర్పించాలని సిఎస్ ఆదేశించారు. భూ రికార్డులను కలక్టర్లు క్రాస్ చెక్ చేయాలన్నారు. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీతో సమావేశం నిర్వహించి బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని వ్యవసాయశాఖకు సిఎస్ సూచించారు. రెవిన్యూశాఖ నుంచి భూముల వివరాలు అందగానే వ్యవసాయశాఖ చెక్కుల పంపిణీకి కార్యచరణను రూపొందించుకోవాలన్నారు.