భానుడి ప్రతాపం..

SMTV Desk 2018-03-02 19:02:19  summer season, high temperature, IMD, hyderabad

హైదరాబాద్, మార్చి 2 : ఈ సారి వేసవి కాలం మొదలవకముందే ఎండలు మండిపోతున్నాయి .బయట ఎండ వేడిమి చూస్తుంటే వేసవి అప్పుడే వచ్చిందా అన్నట్టుగా ఉంది పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో సాధారణ సగటు ఉష్ణోగ్రతల కన్నా 0.5 నుంచి ఒక డిగ్రీ సెల్సియస్‌ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తాజా నివేదికలో తెలిపింది. ఈ సారి మార్చి 1 నుంచే వేసవికాలం మొదలైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల సెల్సియస్‌ మధ్య, తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోనూ వేసవి తాపం చాలా ముందుగానే తాకింది. గరిష్ఠ ఉష్ణోగ్రత.. సరారసరి కన్నా 2-5 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదవుతోంది. కోస్తా, తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ సీజన్లో సగటున 20 రోజులకు మించి వడగాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హైదరాబాద్‌ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి తెలిపారు. రాజస్థాన్‌ నుంచి దక్షిణాదికి వేడిగాలులు వీచే ప్రమాదం ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూడు నెలలు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ హైదరాబాద్‌ కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమలో వడగాల్పుల ప్రభావం తక్కువగానే ఉంటుందని పేర్కొంది.