ఇరు కులాల అభివృద్ధికి తొలి అడుగు

SMTV Desk 2017-06-26 13:21:56  Washer man. Barber, Telangana Goverment,CM, KCR, Finance Minister Eetela Rajender, Minister Jogu Ramanna

హైదరాబాద్, జూన్ 26 : రజక, నాయిబ్రాహ్మణుల కోసం జూలై లో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టడానికి నోచుకున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అందులో భాగంగా ఇరు కులాలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టే పథకాలకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆదివారం సచివాలయంలో రజక, నాయీబ్రహ్మణ ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ రెండు కులాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. రజక, నాయీ బ్రాహ్మణ ప్రత్యేక అభివృద్ధి పథకాలకు వచ్చే నెలలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని, రెండు కులాలు ఆర్థికంగా బలపడేలా కార్యక్రమాలు రూపొందిస్తామని మంత్రులు తెలిపారు. ఒక్కో సంఘం నుంచి 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసుకొని, ప్రత్యేకంగా సమావేశమై తమ వర్గాలకు చెందిన పేదలు, అర్హులైన వారి జాబితాలను తయారు చేసి వారంలోగా ప్రభుత్వానికి అందజేయాలని మంత్రులు సూచించారు. జంట నగరాల్లో ఇతరుల వశమైన దోభిఘాట్ల స్థలాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా విచారణ కమిటీని వేయనున్నట్లు మంత్రులు ప్రకటించారు. చేతివృత్తులను కాపాడుకోవడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకొనే బాధ్యత లబ్దిదారులపై ఉందని వారు పేర్కొన్నారు.. అంతేకాకుండా ఆయా కులాల ప్రతినిధులంతా కలిసి అందరికీ ఉపయోగపడేవిధంగా సలహాలు, సూచనలు ఇస్తే వాటిని స్వీకరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రులు చెప్పారు. ఉపాధికి అవసరమయ్యే పనిముట్లు, ఇతర సామాగ్రి ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి? ఎలాంటి పనిముట్లను తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది? వంటి అంశాలను కమిటీల సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామని మంత్రులు వివరించారు. ఈ సమావేశంలో జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసి కాలప్ప, ఉపాధ్యక్షుడు నేతికార్ ప్రేమ్ లాల్, వాషర్ మెన్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ కొల్లూరు మల్లేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.