రాజధానిలో అమరుల స్మృతివనం

SMTV Desk 2017-06-23 17:48:37  telanga, Immortal heroes, Memorial architecture, Tank, bandRs. 80 crore cost,

హైదరాబాద్, జూన్ 23 : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో అమర వీరుల జ్ఞాపకార్థంగా స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది. రాష్ట్ర సాధన కోసం అమరులైన వారికి ఘన నివాళ్ళు అర్పించేందుకు సచివాలయం పక్కన ట్యాంక్ బ్యాండ్ ను అనుకుని ఉన్న రెండున్నర ఎకరాల్లో విశాలమైన స్థలంలో రూ. 80 కోట్ల వ్యయంతో, ఆరు అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఒక్కో అంతస్తులో 12 వేల చదరపు అడుగుల స్థలంతో పాటు ప్రతి అంతస్తులో ఒక్కో విధమైన ప్రత్యేకతను చాటే విధంగా నిర్మాణాలు ఉండనున్నట్లు సమాచారం. వీటిలో ప్రధానంగా మ్యూజియం, ఆడిటోరియం, తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్ షాపింగ్, రెస్టారెంట్ తో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎత్తైన విగ్రహం సందర్శకులను ఆకట్టుకునే విధంగా ప్రతిపాదించారు. ఈ మేరకు డీపీఆర్ తయారు చేసే పనిని అంతర్జాతీయ ఆర్టిస్టు రమణారెడ్డితో పాటు ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్ట్ కన్సల్టెంట్స్ సంస్థ ప్రతినిధులకు ఆర్ అండ్ బి శాఖ అప్పగించింది. ప్రత్యేక రాష్ట్ర సాధనం కోసం ప్రాణత్యాగం చేసి తెలంగాణ ధ్రువతారలైన అమరువీరుల గుర్తుగా నక్షత్రం ఆకారంలో నిర్మిస్తున్నారు. సందర్శకుల సౌకర్యం కోసం 350 నుంచి 400 కార్ల వరకు నిలుపుకునే విధంగా విశాలమైన పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు, త్యాగాల చరిత్రను భావి తరాలకు అందించే అపూర్వ కట్టడంగా ఆకట్టుకునే పర్యాటక స్థలంగా మారనున్నది.