అటవీశాఖ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2017-06-22 13:52:43  Forest Department, 1,857 Replace Beat Officers posts,Finance department, telangana government, kcr, jogu ramanna, notification

హైదరాబాద్‌, జూన్ 22 : తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ పరిధిలో ఎంతోకాలంగా ఖాళీగా ఉన్న 1,857 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఖాళీలపై అటవీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ డిపార్ట్‌మెం ట్‌ పరిధిలోని ఖాళీలన్నీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిన భర్తీ కానున్నాయి. పోస్టులకు అర్హత నియమాలు ఇతర వివరాలందగానే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అటవీశాఖలో సగానికి పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో అధికారులు, వివిధ స్థాయిలలో ఉద్యోగుల సంఖ్య సుమారు ఐదువేలుండగా అప్పట్లోనే దాదాపు 2007 పోస్టులకు ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ట్రం ఏర్పడేనాటీకే అటవీశాఖలో 51 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 198 మంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 574 మంది బీట్ ఆఫీసర్లు, 1184 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలోనే ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసినప్పటికీ పునర్వ్యవస్థీకరణ వలన నియామకాల ప్రక్రియ కొంతకాలంగా ఆగిందని అటవీశాఖ ఉన్నతాధికారి తెలిపారు. ఆర్థికశాఖ తాజా ఉత్తర్వులతో అటవీశాఖలో ఖాళీలన్నీభర్తీ అవ్వడం, ఇంత భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టడం ఇదే మొదటిసారని వెల్లడించారు. అటవీశాఖలో 1857 బీట్ ఆఫీసర్ల నియామకాలకు అనుమతిని ఇచ్చిన సీఎం కేసీఆర్ కు అటవీశాఖ మంత్రి జోగురామన్న కృతజ్ఞతలు తెలిపారు. అటవీ సంపద రక్షణకు కఠినచర్యలు తీసుకుంటూనే వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వ దృష్టి నిలిపిందని మంత్రి వెల్లడించారు. బీట్ ఆఫీసర్ల నియామకాలకు ఆర్థికశాఖ ఉత్తర్వులివ్వడంపై జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు నాగేంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.