బకాయిలు ఆగిపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన

SMTV Desk 2018-01-19 15:51:26  RTC workers facing issue

హైదరాబాద్, జనవరి 19 : ఏళ్లపాటు సంస్థ అభివృద్ధికి పనిచేసి పదవీ విరమణ చేసిన కార్మిక ఉద్యోగులకు తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు సూచించారు. కానీ టీఎస్ఆర్టీసీలో ఈ పరిస్థితి కానరావడం లేదు. పదవీ విరమణ చేసిన కార్మికులకు అనంతరం ఇచ్చే లబ్ధి చేకురడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. దాదాపు నాలుగు వేల మంది పదవీ విరమణ పొందిన కార్మికులు తీవ్ర ఇబ్బందుల పలు అవుతున్నారు. పీఎఫ్ నిబంధనల మేరకు ఉద్యోగి పదవీ విరమణకు ముందు చివరి నెల అందుకున్న జీతం వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే పీఎఫ్ చేతికి అందుతుంది. అయితే, రావాల్సిన బకాయిలు ఆగిపోవడంతో పీఎఫ్ సైతం అందడం లేదని రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యమే పీఎఫ్ ట్రస్ట్ నిర్వహించడం వల్ల ఎక్కువ మొత్తంలో పించన్ పొందలేక పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కార్మికులకు బకాయిలు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం లేదని, లెక్కలు తేల్చి వారికి రావాల్సినవి ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.